ఏలూరులో సీఎం రోడ్‌ షో, ఫెయిల్యూర్‌

21 Mar, 2019 07:47 IST|Sakshi
ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల రోడ్‌ షో

సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తమ్ముళ్ళు ఎవరికి ఓటేస్తారు అని అడుగుతూ.. వారు వేరే పార్టీ పేరేమైనా చెబుతారేమోనని భయపడి తెలుగుదేశానికి అని చెప్పండి అని అడిగి మరీ చెప్పించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తరువాత చంద్రబాబు తొలిసారిగా నిర్వహించిన రోడ్‌షో పూర్తిగా విఫలమైంది. జిల్లాలోని దాదాపు అందరు అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులు వచ్చినా ప్రజలు మాత్రం రాలేదు. టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన రోడ్‌ షోలో కేవలం టీడీపీ నాయకులు బెదిరించి తీసుకువచ్చిన డ్వాక్రా మహిళలు తప్ప ఎవరూ కనిపించలేదు.  బహిరంగ సభ ప్రాంతమైన పన్నెండు పంపుల సెంటర్‌ వరకూ కూడా ఇదే పరిస్థితి కనిపించింది. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రూ.45 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టును  పూర్తిచేస్తున్నామన్నారు. నదులను అనుసంధానం చేసి రాయలసీమకు కూడా నీళ్ళిచ్చి అభివృద్ధి చేశామన్నారు.  


అభ్యర్థులతో ప్రమాణం..
ముందుగా నూజివీడులో ప్రచారం ముగించుకుని హెలికాప్టర్‌ నుంచి స్థానిక ఇండోర్‌ స్టేడియంలోని హెలీప్యాడ్‌ వద్ద దిగిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఈ ఎన్నికల్లో తమ పార్టీ  అభ్యర్థులు, జిల్లా నాయకులతో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నాయకులతో లైవ్‌లో  ప్రమాణం చేయించారు. అభ్యర్థులకు పార్టీ బి–ఫారాలు  ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ప్రచారం స్పీడ్‌ పెంచాలని సూచించారు. సామాజిక న్యాయం, నాయకుల రేటింగ్, క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులకు సీట్లు కేటాయించామని చంద్రబాబు చెప్పారు.


మరిన్ని వార్తలు