సెలవులు హరీ

12 May, 2018 12:56 IST|Sakshi

ఉద్యోగులకు శాపంగా మారిన సీఎం టూర్‌

వ్యక్తమవుతున్న వ్యతిరేకత

విజయనగరం గంటస్తంభం : ఒకవైపు వేసవి ఎండలు మండుతున్నాయి. మరోవైపు ఉక్కపోత ఊపిరి సలపనీయడం లేదు. ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసే అధికారులు మినహాయిస్తే అందరూ వేసవి తాపానికి విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కరోజు సెలవు దొరి కినా సేద తీరాలని ఉద్యోగులు ఆశపడుతున్నారు. అలాంటిది రెండో శనివారం, ఆదివారం రూపంలో వరుసగా రెండు రోజులు పాటు సెలవులు దొ రికాయి. వేసవి సెలవులు పుణ్యమా అని పిల్లలు కూడా ఇంటివద్దే ఉన్నారు. ఇంకేముంది కుటుంబ సభ్యులతో రెండు, మూడు రోజులు హాయిగా గడుపుదామని భావించిన ఉద్యోగులకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయడు పర్యటన శాపంగా మారంది. ఆయన రాకతో సెలవులు అనుభవించే పరిస్థితి లేకపోవడంతో నిట్టూరుస్తున్నారు.

ఏర్పాట్ల నేపథ్యంలో విధులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన దాదాపుగా ఖరారైంది. వేదిక విషయంలో కాస్త సందిగ్దత ఉన్నా పర్యటన మాత్రం  ఈ నెల 15వ తేదీన ఉంటుంది. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి... వారు తీసుకున్న నిర్ణయాలన్నీ సమర్థించిన చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నా నేపథ్యంలో ఇప్పుడు పోరాటం పేరుతో సభలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో ధర్మపోరాట దీక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 15న విజయనగరంలో దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి పనిలో పనిగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ధర్మపోరాట దీక్ష విజయనగరంలో పెడితే... శంకుస్థాపన కార్యక్రమాలు చీపురుపల్లిలో పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యత అధికారులపై పడింది. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఇప్పటికే చర్యలు చేపట్టారు. సీఎం పర్యటన ఏర్పాట్లు చూసే బాధ్యత జేసీ వెంకటరమణారెడ్డికి అప్పగించడంతో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సాయంత్రం సమావేశమై ఏ అధికారి ఏయే కార్యక్రమాలు చేయాలో మార్గనిర్దేశం చేశారు. దీంతో బాధ్యతలు తీసుకున్న అధికారులు తమ సిబ్బందిని ఏర్పాట్లలో నిమగ్నం చేసే పనిలో ఉన్నారు.

 ముఖ్యమంత్రి పర్యటన కావడంతో అన్ని శాఖల అధికారులు ఉండాల్సిందే.  శాఖా పరమైన నివేదికలు ఇవ్వాల్సిందే. 15వ తేదీన పర్యటన కావడంతో కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో శని, ఆదివారాలు సెలవు దినాలైనా కూడా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీపీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది కూడా ఇందుకు సిద్ధమవున్నారు.

ఇతర శాఖల అధికారులు కూడా ఇదే విధమైన ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనకు రావడం తప్పుకాకపోయినా కాస్తా గడువు ఉన్నట్లు షెడ్యూల్‌ ఇస్తే ఇలాంటి సెలవుల్లో విధులు నిర్వహింవచాల్సిన పరిస్థితి రాకపోయేదని పలువురు ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు.

ఉద్యోగుల్లో నిరాశ 

సీఎం  టూర్‌ నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. చంద్రబాబునాయుడు పాలనలో ఉద్యోగులు స్వేచ్ఛ ఉండదు... పని వేళల కంటే అధిక సమయం పని చేయిస్తారు... మరోవైపు ఒత్తిడి ఉంటుంది... సెలవులు కూడా ఉండవు... ఇదీ సాధారణంగా ఉద్యోగుల్లో ఉన్న భావన. ఉద్యోగులను ఇబ్బంది పెట్టనని 2014 ఎన్నికలకు ముందు ప్రకటనలు గుప్పించిన చంద్రబాబునాయుడు మళ్లీ అదే దారిలో వెళ్తున్నారన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.     

మరిన్ని వార్తలు