ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

13 Jan, 2020 21:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలు కీలక విషయాలపై చర్చించారు. మరీ ముఖ్యంగా అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, షెడ్యూల్‌ 9,10లలోని ఆస్తుల విభజనకు సంబందించిన అంశాలపై చర్చించారు. అలాగే పోలీసుల ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్చలు జరిపారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారుల ఆధ్వర్యంలో చర్చలు జరపాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికారుల బృందం ఏపీకి, అలాగే ఏపీ ప్రధాన కార్యదర్శి, అధికారుల బృందం హైదరాబాద్‌కు రానుంది. రెండు రాష్ట్రాల్లోని తాగు, సాగు నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో జలాల తరలింపుపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా కృష్ణా-గోదావారి అనుసంధానం సహా.. చేపట్టాల్సిన పథకాలపై నిర్మాణాత్మక, ప్రణాళికల తయారీకి ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు