క్రీడారంగానికి కొత్త శోభను తీసుకొస్తాం : సీఎం జగన్‌ 

27 Aug, 2019 19:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు వరాలు ప్రకటించారు. స్పందన కార్యక్రమాన్ని సీఎం మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను ఇవ్వాల్సిందిగా సీఎం ఆదేశించారు. జూనియర్లను ప్రోత్సహిస్తే వాళ్లంతా సింధులా మారతారని అన్నారు. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఈ కార్యక్రమం చేపట్టాలని, ఈ నెల 29 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమం కొనసాగించాలని, ఏటా ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రోత్సాహకాలు ఇలా.. 
- జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం వచ్చిన వారికి రూ. 5 లక్షలు
రజత పతకం వచ్చిన వారికి రూ. 4 లక్షలు
కాంస్యం వచ్చిన వారికి రూ. 3 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాలను ఇవ్వాలి
జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి
ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.1.25 లక్షలు
రజత పతకం వచ్చిన వారికి రూ.75 వేలు
కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి 

(చదవండి : క్రీడాకారులకు సీఎం జగన్‌​ వరాలు)

మరిన్ని వార్తలు