‘అమ్మఒడి’కి ఆమోదం

31 Oct, 2019 04:32 IST|Sakshi

ఒకటి నుంచి ఇంటర్‌ వరకు పేద విద్యార్థులను బడికి పంపే తల్లులకు ఏటా జనవరిలో రూ.15 వేలు ఆర్థిక సాయం

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకులకు ‘జగనన్న అమ్మఒడి’ వర్తింపు

ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీలకు వర్తింపు

తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉంటే సరిపోతుంది

77 గిరిజన మండలాల్లో గర్భిణులు, బాలింతలు,ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం

కృష్ణా–గోదావరి డెల్టా కాల్వల శుద్ధికి ప్రత్యేక మిషన్‌ ఏర్పాటు

వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌ టైం అవార్డులు

హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు

రోబో ఇసుక యూనిట్ల ఏర్పాటుకు పావలా వడ్డీకే రుణాలు

అభ్యంతరంలేని పట్టణ ప్రాంతాల్లో 100 గజాల వరకు రూ.1కే రిజిస్ట్రేషన్‌

147 నియోజకవర్గాల్లో అగ్రి ల్యాబ్స్, 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్‌

సాక్షి, అమరావతి: ఒకటవ తరగతి నుంచి ఇంటర్‌ వరకు పేద విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు పంపే తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం జగనన్న అమ్మ ఒడితో పాటు సబ్‌ ప్లాన్‌ పరిధిలోని 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించడం, కృష్ణా–గోదావరి డెల్టా కాల్వల శుద్ధి, కార్పొరేట్‌ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్‌ టు ఆంధ్రా పేరిట సంస్థ ఏర్పాటు, వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌ టైం అవార్డులు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు, రోబో ఇసుక యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ అగ్రి ల్యాబ్స్, 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటు, అభ్యంతరం లేని పట్టణ ప్రాంతాల్లో 100 చదరపు గజాల వరకు రూపాయికే రిజిష్ట్రేషన్‌ వంటి కీలక నిర్ణయాలకూ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

కేబినెట్‌ నిర్ణయాల్లో కొన్ని ఇలా..
పథకాలు ఇక చకచకా
నవంబర్‌ 1 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు నవంబర్‌ 7న అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు నవంబర్‌ 21న వైఎస్సార్‌ మత్స్యకార నేస్తం కింద వేట విరామంలో ఏటా ఇచ్చే మొత్తం రూ.4,000 నుంచి రూ.10,000కు పెంపు

ఇవి రద్దు..
- విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన 13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందం రద్దు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో చంద్రబాబు సమీప బంధువుకు వీబీసీ ఫెర్టిలైజర్స్‌ పేరుతో ఇచ్చిన 498.93 ఎకరాల భూ కేటాయింపును రద్దు.
పరస్పర అంగీకారంతో స్టార్టప్‌ ఏరియా ఒప్పందం రద్దు.

వేతనం పెంపు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,బోధన ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనం నెలకు రూ.16,000కు పెంచడానికి గ్రీన్‌ సిగ్నల్‌.

ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీ పిల్లలకు అమ్మఒడి 
జగనన్న అమ్మ ఒడి పథకానికి దారిద్య్రరేఖకు దిగువనున్న ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ చదువుతున్న పిల్లలందరూ అర్హులు. అర్హులైన పిల్లల తల్లులకు ఏటా జనవరిలో రూ.15 వేలు అందించనున్నారు. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకులకు వర్తింపజేస్తారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలు సహా ప్రభుత్వ, ప్రైయివేటు, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న పిల్లల తల్లులకూ ఈ పథకం వర్తిస్తుంది.

తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉంటే సరిపోతుంది. పేదరికంలో ఉండి తెల్లరేషన్‌కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే దానిపై విచారించి, అర్హత ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకునేందుకు పాఠశాల విద్య కమిషనర్‌ నేతృత్వంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేస్తారు. జగనన్న అమ్మ ఒడికి ఈ సంవత్సరంలో రూ.6,455 కోట్లు వ్యయం చేయనున్నారు.  

రక్తహీనత నివారించేందుకు అదనపు పౌష్టికాహారం 
పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 8 జిల్లాల్లోని సబ్‌ప్లాన్‌ ఏరియాల్లో 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. రాష్ట్రంలో 7 గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు.. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్‌.పురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో తొలి విడతగా అమలవుతుంది. గర్భిణీలు, బాలింతలకు నెలకు రూ.1,062 విలువైన ఆహారం అందిస్తారు. నెలలో 25 రోజుల చొప్పున రోజూ వేడి అన్నం, కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, తృణ ధాన్యాలు, మాంసకృత్తులు, ఐరన్‌తో సహా అధిక శక్తినిచ్చే పౌష్టికాహారం రేషన్‌గా ఇంటికి సరఫరా చేస్తారు.

ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు పిల్లలకు నెలకు రూ.600 విలువైన ఆహారం అందిస్తారు. నెలలో 30 రోజుల పాటు రోజూ కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, 25 రోజుల పాటు 100 గ్రాముల చొప్పున బాలామృతం ఇస్తారు. 3 నుంచి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలకు నెలకు రూ.560 విలువైన ఆహారం అందిస్తారు. 25 రోజుల పాటు రోజూ కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్లు పాలు, పాయసం లేదా లడ్డూ లేదా బిస్కట్‌ లేదా కేక్‌ (50 గ్రాముల బరువు.. బాలామృతంతో తయారు చేసింది) అల్పాహారంగా అందిస్తారు. 

వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డులు
వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందించిన వారికి, ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డులను అందించేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. విద్య, సామాజిక సేవ, వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్, సివిల్‌ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు, సాహిత్యం, కళలు సహా క్రీడా రంగాల్లో వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డులు అందజేస్తారు. అవార్డుల కమిటీని ముఖ్యమంత్రి నియమిస్తారు. అవార్డులపై తమ సిఫార్సులను కమిటీ సీఎంకు నివేదించనుంది. ఏటా జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15వ తేదీన 50 మంది చొప్పున ప్రతి సంవత్సరం 100 మందికి అవార్డులిస్తారు. జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డుల తరహాలో వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డుల ద్వారా ప్రతిభావంతులను గుర్తిస్తారు.  

ఆంధ్రప్రదేశ్‌  మాల సంక్షేమ కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌ మాదిగ సంక్షేమ కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌ రెల్లి, ఇతర కులాల సంక్షేమ కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవోలను కేబినెట్‌ ఆమోదించింది.  

- హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130 ఆసుపత్రుల్లో గుర్తించిన సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు నవంబర్‌ 1 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద అమలవుతాయి.
తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌.
తీవ్ర పక్షపాతం, తీవ్రమైన కండరాలు క్షీణత, కదల్లేని స్థితిలో మంచానపడ్డవారికి, బోదకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు స్టేజ్‌ 3, 4, 5లలో ఉన్న వారికి నెలకు రూ.5 వేల పెన్షన్‌.
ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ అనంతరం రోగులు కోలుకునే వరకు వైద్యుల సూచన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం. 

నవంబర్‌ 7న అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు. 3,69,655 మందికి సుమారు రూ.264 కోట్లు చెల్లింపు. 
గ్రామ, వార్డు సచివాలయాల్లో 397 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి ఆమోదం. హోం శాఖలో అదనంగా పోస్టుల భర్తీ.  
రాజ్‌భవన్‌ సచివాలయంలో తాత్కాలిక పద్ధతిలో 35 మంది అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదం.  
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు బ్యాంకుల నుంచి రుణాలు, బాండ్లు జారీకి అనుమతి.  
రాష్ట్రంలోని 147 గ్రామీణ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆమోదం. 13 జిల్లా కేంద్రాలు, 4 ప్రాంతాల్లో రీజినల్‌ కోడ్‌ సెంటర్లు.  
నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు అందేలా చూసేందుకు అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటు. మార్కెట్‌కు వచ్చేముందు, వెళ్లే ముందు పరీక్షలు నిర్వహిస్తారు.  
9 జిల్లాల్లో 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్‌.  
కృష్ణా, గోదావరి డెల్టా కాల్వలను శుద్ధి చేసేందుకు ప్రత్యేకంగా మిషన్‌ ఏర్పాటు. ఈ మిషన్‌కు చైర్‌పర్సన్‌గా సీఎం, వైస్‌ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. కాలుష్యాన్ని నివారించి పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తుంది.  

మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం 
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 21న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్‌ మత్స్యకార నేస్తం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇప్పుడు ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచి ఇవ్వనున్నారు. మోటారైజ్డ్, మెకనైజ్డ్‌ బోట్లతో పాటు తెప్పలతో సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. డీజిల్‌ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ప్రాంతంలో చమురు, సహజ వాయువుల కోసం జరిపిన తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఓఎన్జీసీ చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు 
హజ్, జెరూసలేం యాత్రికులకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వార్షికాదాయం రూ.మూడు లక్షలలోపు ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.40 వేల నుంచి రూ.60 వేలకు.. వార్షికాదాయం రూ.మూడు లక్షలకు పైబడి ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతారు. ఇందుకోసం బడ్జెట్‌లో వేర్వేరుగా చెరో రూ.14.22 కోట్లు కేటాయించారు.   

రోబో ఇసుక యూనిట్లకు పావలా వడ్డీ రుణాలు 
కంకర నుంచి రోబో శ్యాండ్‌ (ఇసుక) తయారు చేసే స్టోన్‌ క్రషర్స్‌ యూనిట్లను కొత్త యంత్రాలతో అప్‌గ్రేడ్‌ చేసుకునేవారికి రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ పావలా వడ్డీ కింద రుణాలివ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం ఏడాదికి రూ.37.3 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.186.5 కోట్లు కేటాయించారు. ఈ యూనిట్ల మనుగడలో భాగంగా 50 కిలోమీటర్ల పరిధిలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో రోబో శ్యాండ్‌ను 20 శాతం వాడేలా చర్యలు తీసుకుంటారు. రోబో శ్యాండ్‌ యూనిట్లుగా అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు ఆరు నెలలు గడువు ఇచ్చారు.  

పేదలకు రిజిస్ట్రేషన్‌ కానుక 
అభ్యంతరం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ ఇళ్ల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 300 చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి వంద చదరపు గజాలలోపు ఉన్న ఇళ్లను క్రమబద్ధీకరించి రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు చెందిన వారైతే వంద నుంచి 300 చదరపు గజాల వరకు ఉన్న ఇళ్లను మార్కెట్‌ విలువ ప్రకారం జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన విధానంలో క్రమబద్ధీకరిస్తారు. 300 చదరపు గజాల వరకు ఇలా క్రమబద్ధీకరించుకున్న ఇళ్లను ఐదేళ్ల వరకూ అమ్ముకునే వీలుండదు. పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను అర్హులైన మరొకరు కొనుక్కుంటే వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు.  

భూ కేటాయింపులు రద్దు 
విశాఖలో లులూ..
విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన రూ.13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందాన్ని రద్దు చేశాం. ఎకరం రూ.50 కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని నెలకు రూ.4 లక్షల నామమాత్రపు అద్దెకు కేటాయించడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని భావించాం. ఎకరం విలువ రూ.50 కోట్లు అయితే, ఆ సొమ్మును బ్యాంకులో పెడితే వడ్డీనే రూ.2.5 కోట్లు వస్తుంది. అలాంటిది వచ్చే వడ్డీలో కేవలం 20 శాతాన్ని మాత్రమే అద్దె కింద నిర్ణయించడం సబబు కాదు. లులూ కంపెనీకి అప్పనంగా భూమిని కట్టబెట్టడమే కాకుండా, సీఎమ్మార్‌ సంస్థకు చెందిన మరో 3 ఎకరాల భూమిని కూడా లులూకు ఇవ్వడం కోసం అందుకు ప్రత్యామ్నాయంగా సీఎమ్మార్‌కు అంతకంటే విలువైన భూమిని, అత్యంత విలువైన సిరిపురం ప్రాంతంలో అన్యాయంగా కట్టబెట్టారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ మార్గదర్శకాల ప్రకారం సింగిల్‌ టెండర్‌ దాఖలైతే దాన్ని రద్దు చేయకుండా ఆ సంస్థకే కేటాయించడం వల్ల ప్రజల ఆస్తికి నష్టం జరుగుతున్న దృష్ట్యా ఆ కేటాయింపులను రద్దు చేశాం. 

జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్‌..
ఇలా ఉండగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 498.93 ఎకరాల కేటాయింపును రద్దు చేశాం. ప్రజలు నవ్విపోతారని కూడా ఆలోచించకుండా, సొంత వియ్యంకుడికి, లోకేష్‌ తోడల్లుడికు చెందిన వీబీసీ సంస్థకు అంటే ఇటీవలే మరణించిన ఎంవీవీఎస్‌ మూర్తికి చెందిన సంస్థకు అతితక్కువ ధరకే అప్పనంగా ఈ భూములు కట్టబెట్టారు. 2015 జూలై 15న భూములు కేటాయించి, పట్టుమని రెండు నెలలు తిరగకుండానే అదే ఏడాది సెప్టెంబర్‌ 22న ఈ భూములను సీఆర్డీఏ పరిధిలోకి చేర్చారు. ఈ కారణంగా ఈ భూముల రేటు అమాంతం వందల రెట్లు పెరిగింది. ఈ రసాయన పరిశ్రమ స్థాపించాక అది వెదజల్లే కాలుష్యం వల్ల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల వారి ఆరోగ్యాలకు ముప్పు ఏర్పడుతున్నందున రద్దు చేశాం. 

పరస్పర అంగీకారంతో స్టార్టప్‌ ఏరియా ఒప్పందం రద్దు.. 
అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్స్‌ (ఏడీపీ) లిమిటెడ్‌ను మూసి వేయాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భాగస్వాములైన అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ పరస్పర అంగీకారంతో ఏడీపీని మూసివేయాలని బోర్డులో తీర్మానం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఏడీపీని రద్దుచేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో పనులు ప్రారంభం కాలేదని కేబినెట్‌లో చర్చించారు. అలాగే ఏడీపీకి భూములపై జనరల్‌ పవర్‌ అటార్నీ కూడా బదిలీ చేయలేదు. అసెండాస్, సెమ్బ్‌ బ్రిడ్జి  విలీనం అంశం ఆమోదించిన ఒప్పందంలో లేదని సింగపూర్‌ కన్సార్టియం తెలిపింది.

ఈ నేపథ్యంలోనే స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుపై ముందుకు వెళ్లరాదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుపై చర్చించి సింగపూర్‌ కంపెనీల కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్‌ కంపెనీల కన్సార్టియం 58 శాతం వాటాతో రూ.306 కోట్ల మూల ధన పెట్టుబడి, అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌ 42 శాతం వాటాతో రూ.222 కోట్ల పెట్టుబడితో చంద్రబాబు సర్కారుకు ఒప్పందం చేసుకుంది.  

మరిన్ని వార్తలు