నాడు–నేడుతో మార్కెట్లకు కొత్త రూపు

19 Nov, 2019 04:29 IST|Sakshi

ప్రతి నియోజకవర్గంలో మార్కెట్‌ యార్డ్‌  

అగ్రిమిషన్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ 

రాష్ట్రంలో కొత్తగా 56 రైతు బజార్లు.. జనవరి 1 నుంచి అగ్రి వర్క్‌షాపులు

బయోపెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్‌లలో మోసాల నియంత్రణకు త్వరలో చట్టం

చీనీ, చిరు ధాన్యాలకు గిట్టుబాటు ధర

రైతు భరోసా జయప్రదం.. అధికారులకు అభినందన

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

సాక్షి, అమరావతి : వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు వేదికలైన మార్కెట్‌ యార్డులను ‘నాడు–నేడు’ కింద ఆధునికీకరించడంతో పాటు మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటల ధరలు ఎక్కడ పడిపోతుంటే అక్కడ వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా గిట్టుబాటు ధర కంటే తక్కువకు అమ్మేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఐదో అగ్రి మిషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్‌ యార్డ్‌ విధిగా ఉండాలన్నారు. అవసరమైతే అధ్యయనం చేసి మరికొన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

మార్కెట్‌ యార్డులకూ ‘నాడు–నేడు’ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. కొన్ని రైతు బజార్లలో రైతులు కాని వారు అమ్మకాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నందున నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 56 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన చోట్ల వేరుశనగ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చిరుధాన్యాల శుద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిరుధాన్యాల సాగు ఖర్చు పరిగణనలోకి తీసుకుని గిట్టుబాటు అయ్యేలా తక్షణమే కొనుగోలు ధర నిర్ణయించాలన్నారు. టమాటా ధర పడిపోకుండా మార్కెటింగ్‌ శాఖ కొనుగోలు చేసి ధరలు స్థిరీకరించాలని చెప్పారు. గోడౌన్ల నిర్మాణంపై నియోజకవర్గాలు, మండలాల వారీగా మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. చీనీ రైతులకు మంచి ధర వచ్చేలా అనుసరించాల్సిన మార్కెటింగ్‌ వ్యూహాలపైనా చర్చించారు. పత్తి కొనుగోళ్లపై ఆరా తీశారు.

రైతు భరోసా కింద 45,20,616 మందికి లబ్ధి 
రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 45,20,616 మంది రైతు కుటుంబాలు లబ్ధి పొందాయని అధికారులు వివరించినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వారిని అభినందించారు. డిసెంబర్‌ 15 వరకు కౌలు రైతులకు అవకాశం కల్పించాలని, దేవాలయాల భూములు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులనూ రైతు భరోసా కింద పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు ఉన్నందున వచ్చే మే నెల నాటికి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని సూచించారు. 

జనవరి నుంచి వర్క్‌షాప్‌లు 
గ్రామ సచివాలయాల పక్కన ఏర్పాటు చేసే దుకాణాలు, వర్క్‌షాపులు జనవరి 1 నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకూ ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందన్నారు. భూసార పరీక్షలు వర్క్‌షాపులోనే నిర్వహించాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని, గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, ఉద్యాన అసిస్టెంట్ల సేవలను వర్క్‌షాపుల్లో విరివిగా వినియోగించుకోవాలని సూచించారు. బయో ఫెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్‌ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఏపీ బయో ప్రోడక్టŠస్‌ రెగ్యులేటరీ యాక్ట్‌ తీసుకు రావాలని సీఎం నిర్ణయించారు.

వణ్యప్రాణుల నుంచి పంటలకు రక్షణ కల్పించి నష్ట పరిహారం అందించడంపై సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్కెటింగ్‌ శాఖ  కొనుగోళ్ల వల్ల టమాటా రైతులు నష్టపోకుండా చూడగలిగామని అధికారులు చెప్పగా, ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేనితో పాటు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్, అగ్రీ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

త్వరలో బయో పెస్టిసైడ్స్‌ రెగ్యులేటరీ చట్టం : కన్నబాబు
బయో పెస్టిసైడ్స్‌ పేరిట కొన్ని కంపెనీలు విచ్చలవిడిగా నాణ్యతలేని మందులను విక్రయిస్తున్నందున వాటి నియంత్రణకు బయో పెస్టిసైడ్స్‌ నియంత్రణ చట్టాన్ని త్వరలో తీసుకురానున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులు సహా అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా కింద లబ్ధి చేకూరుస్తామని, ఇంకా 1.20 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ స్కూలు పిల్లలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లను స్థానిక పౌల్ట్రీ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు. కోతులు, జింకలు వన్య ప్రాణులతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు.  

మే నాటికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన : నాగిరెడ్డి
మే నెల నాటికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కావాలని సీఎం ఆదేశించినట్టు అగ్రీ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి చెప్పారు. చిరుధాన్యాల కోసం ప్రత్యేకంగా మిల్లెట్‌ బోర్డును ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. రికార్డులను సరిచేసి అర్హులైన వారికి రైతుభరోసా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. 

మరిన్ని వార్తలు