విద్యా విప్లవానికి శ్రీకారం

22 Jan, 2020 03:40 IST|Sakshi

రాష్ట్ర, దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా సంస్కరణలు 

అసెంబ్లీలో ‘అమ్మఒడి’పై చర్చలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి విద్యా కానుకగా కిట్‌

కిట్‌లో బ్యాగ్, టెక్ట్స్‌ బుక్స్, నోట్‌ బుక్స్, షూస్, సాక్స్, బెల్ట్, 3 జతల యూనిఫాం

36.10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

‘గోరుముద్ద’ పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం

వచ్చే నెలలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన

పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ వసతి.. మెస్‌ చార్జీలకు ఏటా రూ.20 వేలు

దేశ చరిత్రలోనే తొలిసారిగా అమ్మఒడి ప్రారంభం 

రాష్ట్రంలో 42,33,098 మంది తల్లులకు రూ.15 వేలు

రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం ఎడ్యుకేషన్‌.. వరల్డ్‌ బెస్ట్‌ కరిక్యులమ్‌ కోసం కసరత్తు.. 45 వేల పాఠశాలల్లో నాడు–నేడు కింద మౌలిక వసతులు

ముఖ్యమైన అంశంపై చర్చలో టీడీపీ పాలుపంచుకోకపోవడం సరికాదు 

పిల్లలకు రోజూ ఒకే రకమైన భోజనం పెట్టకుండా మార్పులు తీసుకొస్తూ మెనూ రూపొందించాం. ఇందులో నేను బాగా ఇన్వాల్వ్‌ కావడం నాకే ఆశ్చర్యం అనిపించింది. పిల్లలు బడుల్లో ఎలాంటి భోజనం తింటున్నారని ఏ ముఖ్యమంత్రీ ఇంతగా ఆలోచించి ఉండరు. ఈ మాత్రం శ్రద్ధ తీసుకోకపోతే మార్పు రాదు.
 
– సీఎం వైఎస్‌ జగన్‌

ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించి వరల్డ్‌ వైడ్‌ బెస్ట్‌ కరిక్యులమ్‌ను రూపొందించడంలో భాగంగా సింగపూర్, చికాగో, కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌.. తదితర వర్సిటీల విద్యా విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. బెస్ట్‌ ప్రాక్టీషనర్స్, స్టడీ మెటీరియల్, గ్లోబల్‌ స్టాండర్డ్స్, చైల్డ్‌ ఫ్రెండ్లీ బుక్స్, టెక్ట్స్‌ బుక్స్, హ్యాండ్‌ బుక్స్, పేరెంట్స్‌ హ్యాండ్‌ బుక్స్, గైడెన్స్‌ బుక్స్, యాక్టివిటీ గైడెన్స్‌ను రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 


సాక్షి, అమరావతి: పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువేనని, అందుకే పేద పిల్లలకు మెరుగైన విద్య అందించేలా విద్యా రంగంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అమ్మఒడి, మధ్యాహ్న భోజనం, నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అర్హులందరికీ ఇవ్వడంతో పాటు ఏటా పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి విద్యా కానుక కింద ఒక కిట్‌ అందజేస్తామన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంత వరకు దేశంలో ఎక్కడా జరగని విధంగా ఓ గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోందన్నారు. ఇంతటి ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వారి పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభలో ఉండి ఉంటే బావుండేదన్నారు. ఇలాంటి మంచి చర్చలో పాల్గొనక పోవడం ధర్మం కాదన్నారు. వాళ్ల పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు గడ్డి పెడుతూ బుద్ధి వచ్చేలా మాట్లాడారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

క్వాలిటీ ఎడ్యుకేషన్‌ దిశగా అడుగులు 
‘కాసేపటి క్రితం గౌరవ సభ్యులు మాట్లాడుతూ అక్షరాస్యతకు సంబంధించిన లెక్కలు చెప్పారు. రాష్ట్రంలో చదువురాని వారు 33 శాతం ఉన్నారు. దేశం యావరేజ్‌ చూస్తే 27 శాతం మాత్రమే. ఈ లెక్కన రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటర్‌ తర్వాత ఎంత మంది పిల్లలు పై చదువుల కోసం ఎన్‌రోల్‌ అవుతున్నారన్నది పరిశీలిస్తే చాలా తక్కువ శాతం కనిపిస్తోంది. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) ప్రకారం దేశంలో 23 శాతం మంది మాత్రమే పై చదువులు చదువుతున్నారు. అంటే 77 శాతం మంది మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. పిల్లలకు మనం ఇవ్వాల్సిన ఏకైక ఆస్తి చదువే. నాణ్యతతో కూడిన విద్య అందిస్తేనే వాళ్ల జీవితాలు బాగుపడతాయి. అందుకే విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తూ నాలుగు అడుగులు ముందుకేస్తున్నాం. ఇందులో తొలి అడుగు అమ్మ ఒడి. రాష్ట్రంలో 82 లక్షల మంది పిల్లల భవిష్యత్‌ మార్చడం కోసం తల్లులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది. అక్షరాలా 42,33,098 మంది తల్లులకు ఈ కార్యక్రమం వల్ల మేలు జరుగుతోంది. జనవరి 9న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. యాదృచ్ఛికంగా గత ఏడాది అదే రోజు నా పాదయాత్ర ముగిసిన రోజు. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజు ఇంత గొప్ప కార్యక్రమం ప్రారంభించినందుకు దేవుడికి, ప్రజలకు రుణ పడి ఉంటాను.  

దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమం 
అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించాక కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే 40,19,323 మంది తల్లుల అకౌంట్లలో రూ. 6,028 కోట్లు జమ చేశాం. ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్ర, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వివిధ సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయిన 2.12 లక్షల అకౌంట్లకు సంబంధించి ఆధార్, బ్యాంక్‌ అకౌంట్లను వెరిఫై చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు లక్షా 28 వేల 259 మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ అయింది. పేమెంట్‌ ఫెయిల్‌ అయిన 48 వేల ఖాతాలు, బ్యాంక్‌ అకౌంట్‌ ఇష్యూస్‌.. 38 వేల ఖాతాలకు సంబంధించి లోటుపాట్లు సరిచేసి మరో వారంలో ఆ తల్లులకు కూడా మంచి చేస్తాం. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించినప్పుడే విద్యా వ్యవస్థలో  మార్పులొస్తాయి.   

నాణ్యమైన భోజనం పెట్టడమే లక్ష్యం 
మేము అధికారంలోకి రాగానే చిన్నపాటి ఎన్నికలు నిర్వహించి స్కూల్‌లో పేరెంట్‌ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇందులోంచి ముగ్గురు సభ్యులతో సబ్‌ కమిటీ వేస్తున్నాం. ఈ సబ్‌కమిటీ మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షిస్తుంది. రేషన్, క్వాలిటీ, మెనూను ఈ కమిటీ సభ్యులు రోజూ చెక్‌ చేస్తారు. గ్రామ సచివాలయంలో ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ రోజు మార్చి రోజు క్వాలిటీ చెక్‌ చేయాలి. ప్రధానోపాధ్యాయుడు రెగ్యులర్‌గా రిపోర్టులు పంపిస్తారు. ఆయా ప్రాంతాల్లోని సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌లు కూడా తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ నాణ్యతను పరిశీలిస్తాయి. ఈ నాలుగంచెల క్వాలిటీ తనిఖీలను మానిటర్‌ చేసేందుకు ఆర్డీవో స్థాయి అధికారిని కూడా నియమిస్తాం. అవినీతిని నిర్మూలించి, పారదర్శకత పాటిస్తూ గుడ్ల సరఫరాకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌కు శ్రీకారం చుడుతున్నాం. పౌల్ట్రీ ఫామ్స్‌ ఫార్మర్స్‌ మాత్రమే టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నాం.   

ప్రతి స్కూల్లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌ 
ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తాం. ఇందులో ఇంగ్లిష్‌ మూవీస్‌ను ప్రదర్శించడం, రైమ్స్, ఆడియో బుక్స్, స్టోరీ బుక్స్‌తో లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మానిటర్‌ చేసేందుకు ప్రత్యేకించి జాయింట్‌ సెక్రటరీ స్థాయి ఐఏఎస్‌ అధికారిని నియమించాం.   

గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం
విద్యా సంస్కరణల్లో భాగంగా ఈ రోజు (మంగళవారం) నుంచి మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తీసుకొస్తూ రెండవ అడుగు వేస్తున్నాం. ప్రతి రోజూ మెనూలో ఏం పెడుతున్నామో స్పష్టంగా చెబుతున్నాం.   
సోమవారం: అన్నం, పప్పు చారు, ఎగ్‌ కర్రీ, చిక్కీ 
మంగళవారం: పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు 
బుధవారం: వెజిటబుల్‌ రైస్‌ (కూరగాయలతో కూడిన అన్నం), ఆలూ కూర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ 
గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు 
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ 
శనివారం : అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగల్‌ 

ఈ కార్యక్రమానికి గోరుముద్ద అని (జగనన్న గోరుముద్ద అని సభ్యుల నినాదాలు) నామకరణం చేస్తున్నాం. మొన్నటి దాకా ఆయాలకు రూ.వెయ్యి కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. సరుకుల బిల్లులు కూడా 6 నుంచి 8 నెలలుగా ఇవ్వని పరిస్థితిని నా పాదయాత్రలో చూశా. సరుకుల బిల్లు నెల నెలా ఇవ్వకపోతే, క్వాలిటీ ఫుడ్‌ ఉండదు. మానిటర్‌ చేసే పద్ధతి కూడా లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆయాలకు ఇస్తున్న రూ.వెయ్యిని రూ.3 వేలకు పెంచి వారిని సంతోష పెట్టాం. నాణ్యతలో రాజీ పడకుండా చేశాం. ఇందువల్ల రూ.344 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. అయినా పిల్లల కోసం ఖర్చు పెట్టే ఈ మొత్తం ఎక్కువ కాదని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం.  

స్కూళ్ల ప్రారంభానికి ముందే విద్యా కానుక
జూన్‌ 12వ తేదీన స్కూలు మొదలయ్యే నాటికి ప్రతి విద్యార్థికి కిట్‌ అందించడానికి చర్యలు తీసుకుంటూ.. ఇంకో గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 36 లక్షల 10 వేల మంది పిల్లలకు విద్యా కానుక కింద రూ.1,355 విలువ చేసే కిట్‌ను అందిస్తాం. ఈ కిట్‌లో స్కూల్‌ బ్యాగ్, టెక్ట్స్‌ బుక్స్, నోట్‌ బుక్స్, మూడు జతల యూనిఫాం (ఓన్లీ క్లాత్‌ ఇస్తాం.. కుట్టించుకోడానికి తల్లులకు డబ్బులిస్తాం), బూట్లు, రెండు జతల సాక్స్‌లు, బెల్ట్‌ ఉంటాయి.

ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రేపు ఫిబ్రవరి నెలలో లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రాడ్యుయేషన్‌లో ఉన్న పిల్లలకు మెస్‌ చార్టీలు, బోర్డింగ్‌ చార్జీల కోసం ఏటా తల్లికి రూ.20 వేలు ఇస్తాం. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా.. జూలై–ఆగస్టులో ఒకసారి, జనవరి–ఫిబ్రవరిలో మరోసారి ఇస్తాం. దీంతో పాటు విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తాం. తద్వారా జీఈఆర్‌ రేషియోలో 77 శాతం ఎన్‌రోల్‌ కాని పరిస్థితిని రివర్స్‌ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాం. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో మరిన్ని గొప్ప పనులు జరగాలని ఆశిస్తున్నాం.

ఇంగ్లిష్‌ మీడియంతో పేదల బతుకుల్లో మార్పు 
మూడో అడుగుగా ఇంగ్లిష్‌ మీడియం బిల్లు తీసుకొచ్చాం. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ కాదు.. రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం ఎడ్యుకేషన్‌ అనే నినాదం తీసుకొచ్చాం. ఇలాగైతేనే పిల్లల జీవితాలు బాగుపడతాయి. పిల్లలు ప్రపంచంతో పోటీపడగల పరిస్థితి ఉంటుంది. పెద్ద వయసు వచ్చే సరికి ఫ్లో ఆఫ్‌ లాంగ్వేజ్‌ మెరుగు పడుతుంది. అప్పుడే ఉద్యోగాలు సాధిస్తారు. ఇందుకోసం వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లిష్‌ మీడియం తీసుకొస్తాం. ఆ తర్వాతి సంవత్సరం 7వ తరగతి, ఆ తర్వాత ఏడాది 8, ఆ తర్వాత 9, ఆ తర్వాత 10వ తరగతికి విస్తరింప చేస్తాం.

రాబోయే చాలెంజెస్‌ను పరిగణనలోకి తీసుకుని కరిక్యులమ్‌లో కూడా మార్పులు చేస్తున్నాం. టీచర్లకు శిక్షణ, నాలుగు, ఐదు తరగతుల పిల్లలకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తాం. కరిక్యులమ్‌కు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్‌ కాన్‌బెర్రా, సింగపూర్‌ గవర్నమెంట్‌తో, యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోతో విద్యా శాఖ అధికారులు చర్చిస్తున్నారు. స్కూళ్లు తెరిచే లోగా టీచర్లకు శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాకు 20 మంది చొప్పున 260 మంది స్టేట్‌ రిసోర్స్‌పర్సన్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వీరు ప్రతి మండలంలో నలుగురికి శిక్షణ ఇస్తారు. ఏప్రిల్, మే నాటికి సబ్జెక్ట్‌ స్పెసిఫిక్‌ ట్రైనింగ్‌ పూర్తవుతుంది. మంత్లీ ఓరియెంటేషన్, స్కూల్‌ కాంప్లెక్స్, సెల్ఫ్‌ లెర్నింగ్‌ కోసం ప్రత్యేక యాప్స్‌ను పెడతాం. డ్యాష్‌ బోర్డ్‌ ద్వారా పరిశీలిస్తాం. 

నాడు–నేడుతో సమూల మార్పులు  
రాష్ట్రంలోని 45 వేల స్కూళ్లు.. కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టళ్లలో మార్పులు జరగాలి. లేదంటే పరిస్థితి దారుణం. పాదయాత్రలో చాలా చోట్ల అధ్వాన్న పరిస్థితిలో ఉన్న స్కూళ్లను చూశాను. ఆ పరిస్థితిని మార్చడానికి 9 రకాల మౌలిక వసతులు కల్పించేలా నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా టాయిలెట్లు, ఫ్యాన్లు, డ్రింకింగ్‌ వాటర్, విద్యార్థులు.. సిబ్బంది ఫర్నిచర్, స్కూల్‌ పెయింటింగ్, బ్లాక్‌ బోర్డులు, మరమ్మతులు, ల్యాబ్స్, కాంపౌండ్‌ వాల్‌పై దృష్టి సారిస్తాం. ఈ కార్యక్రమం కింద ఈ ఏడాది 15,715 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించాం. ఈ నెల 18వ తేదీ నాటికి 12,368 స్కూళ్లలో పనులు మొదలయ్యాయి. క్వాలిటీ కోసం సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కింద ఫర్నిచర్‌ కొనుగోలుకు వారం లోగా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు