‘ఆరోగ్య’ అభయం

30 May, 2020 04:16 IST|Sakshi

వైద్య రంగంపై మేధోమథన సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌

1.42 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీతో భరోసా

వైద్యానికి పేదలు అప్పుల పాలు కాకూడదు 

అందుకే పథకంలో విప్లవాత్మక మార్పులు

కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ ఆసుపత్రులు 

రూ.16 వేల కోట్లతో మూడేళ్లలో మహర్దశ 

రాష్ట్రంలో మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులు 

వచ్చే ఏడాది మార్చికి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు

వైద్య సిబ్బంది భర్తీకి వారంలో నోటిఫికేషన్‌

జూలై 1న కొత్తగా 1,060 అంబులెన్స్‌లు

గత సర్కారు ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.682 కోట్లు పెండింగ్‌ పెడితే చెల్లించాం

నాకే కాదు.. ప్రధాని స్థానంలో ఉన్న వారికి బాగా లేకున్నా మన ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే మంచి మందులు దొరుకుతాయని గర్వంగా చెబుతున్నా. పేదలు అప్పుల పాలయ్యే పరిíస్థితి రెండు సందర్భాల్లో వస్తుంది., ఒకటి అనారోగ్యం కాగా.. రెండోది పిల్లల ఫీజులు. అందుకే దివంగత వైఎస్సార్‌ ఈ రెండిటికీ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆయన తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు.

గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరకడంతో పిల్లలు చనిపోయారు. సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో డాక్టర్లు ఆపరేషన్లు చేశారు. అంత దారుణమైన స్థితిలో ఆస్పత్రులు పని చేశాయి. వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల్లో కాంట్రాక్టుల రూపంలో డబ్బులిచ్చినా సేవలు మాత్రం అందలేదు. ఆ పరిస్థితిని మార్చాలని నిర్ణయం తీసుకున్నాం
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడం, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.16 వేల కోట్లకుపైగా వ్యయం చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చికల్లా రూ.2,600 కోట్ల వ్యయంతో 13,000కిపైగా గ్రామ, వార్డు వైఎస్సార్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు 9712 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది నియామకం చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 బోధనాస్పత్రులకు తోడు కొత్తగా 16 టీచింగ్‌ ఆసుపత్రులు, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పిల్లలు, అవ్వా తాతలందరికీ  వైఎస్సార్‌  కంటి వెలుగు ద్వారా పరీక్షలు, చికిత్సలు చేయించడం తన మనసుకు ఎంతో నచ్చిన విషయమని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా  ప్రజారోగ్యమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తెస్తున్నామని, ఏడాదిలోనే మేనిఫెస్టోలో 90 శాతానికి పైగా అమలు చేశామని సీఎం జగన్‌ వివరించారు. ‘మన పాలన–మీ సూచన’లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య రంగంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. లబ్ధిదారులు, వైద్య రంగ నిపుణులతో ముఖాముఖి నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగం వివరాలివీ...
వైద్యరంగంపై మేధోమథన సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. సదస్సుకు హాజరైన వైద్యరంగ నిపుణులు, లబ్ధిదారులు, ఉన్నతాధికారులు 

ఆరోగ్యంపై అడుగులు ముందుకు..
గత ఏడాది కాలంలో వివిధ పథకాలు అమలు చేస్తూనే ఆరోగ్య రంగంలో రెండు అడుగులు ముందుకు వేశాం. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో బకాయిలు పెట్టినా ముందుకు వెళ్లాం. ఆరోగ్య రంగం అనగానే గతంలో 108, 104 సర్వీసులు, కుయ్‌ కుయ్‌ శబ్దం వినిపించేది. అప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది నాన్న  వైఎస్సార్‌. బహుశా ఆయన గుర్తుకొస్తారనే గత పాలకులు నిర్లక్ష్యం చేశారేమో.

ఆరోగ్యశ్రీ విస్తరణ
ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి కూడా వర్తింప చేశాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1.42 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని 2 వేల వ్యాధులకు విస్తరిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. జూలై 8న  వైఎస్సార్‌ పుట్టిన రోజున మరో 6 జిల్లాలకు దీన్ని విస్తరిస్తాం. మిగిలిన 6 జిల్లాల్లో దీపావళి నుంచి అమలు చేస్తాం. ఇప్పటికే 1,200 జబ్బులకు పథకం వర్తింపచేస్తున్నాం. క్యాన్సర్‌కు కూడా చికిత్స అందిస్తున్నాం. గతంలో వినికిడి లోపం ఉంటే (మూగ చెవుడు) సింగిల్‌ కాక్లియర్‌ ఆపరేషన్‌ చేయించాలన్నా కష్టంగా ఉండేది. పాదయాత్రలో నన్ను చాలా మంది అడిగితే సొంత ఖర్చుతో  ఆపరేషన్లు చేయించా. ఇవాళ డబుల్‌ కాక్లియర్‌ ఆపరేషన్లు, బ్యాటరీతో పాటు స్పీచ్‌ థెరపీ కూడా పథకంలోకి తెచ్చాం. దాదాపు 132 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. 

రూ.682 కోట్ల బకాయిలు చెల్లించాం..
గత ప్రభుత్వ హయాంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వకపోవడంతో  చికిత్సకు నిరాకరిం చాయి. రూ.682 కోట్ల బకాయిలు నెట్‌వర్క్‌ ఆస్ప త్రులకు చెల్లించాం. ఫలితంగా ఇప్పుడు ఆ ఆస్ప త్రులు గౌరవంగా స్వాగతిస్తూ చికిత్సలు అందిస్తున్నాయి. బి–గ్రేడ్‌ ఆస్పత్రులన్నీ 6 నెలల్లో ఏ–కేటగిరీలోకి రావాలని, లేదంటే ఆరోగ్య శ్రీ పరిధి నుంచి తప్పిస్తామనడంతో సౌకర్యాలు మెరుగుపర్చుకుంటున్నాయి.

రెండు వారాల్లో సర్టిఫికెట్లు..
గతంలో వికలాంగులు, అంగవైకల్యం వారికి సదరమ్‌ క్యాంప్‌ల్లో (వికలాంగుల కోసం) సర్టిఫికెట్‌ కోసం 4 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. గతంలో 57 చోట్ల సదరమ్‌ క్యాంప్‌లు జరగ్గా వాటిని 167కు పెంచాం. ప్రతి సీహెచ్‌సీలో సదరమ్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. రెండు, మూడు వారాల్లోనే సర్టిఫికెట్లు జారీ చేయగలుగుతున్నాం

ఆస్పత్రులు–నాడు–నేడు
నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తున్నాం. ఫొటోల ద్వారా తేడాను చూపిస్తాం. ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల నిర్మాణం.. ఇలా ప్రజారోగ్యంపై రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. ఆపోలో ఆసుపత్రితో సమానంగా సర్కారీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తాం.

విలేజ్, వార్డు క్లినిక్‌లు
ప్రతి ఊరి రూపురేఖలు మార్చబోతున్నాం. 2 వేల జనాభా ఉన్న గ్రామంలో సచివాలయం, వలంటీర్ల సేవలు, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్, ఒక విలేజ్‌ క్లినిక్‌ ఉంటాయి. ఆ క్లినిక్‌లో ఆశా వర్కర్లు రిపోర్టు చేస్తారు.  ఏఎన్‌ఎం నర్సు ఉంటారు. 54 రకాల మందులు ఉంటాయి. విలేజ్‌ క్లినిక్‌లు ఆరోగ్యశ్రీకి రెఫరల్‌ పాయింట్‌గా పని చేస్తాయి.  కాల్‌ చేసిన వెంటనే 108, 104 సర్వీసులు 20 నిమిషాల్లో చేరుకుంటాయి. దాదాపు 13 వేలకు పైగా విలేజ్‌ క్లినిక్‌లు, వార్డు క్లినిక్‌ల నిర్మాణానికి రూ. 2,600 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టాం. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అవి పూర్తి అవుతాయి.

ఆరోగ్య కేంద్రాలు: నాడు– నేడు
నాడు–నేడులో కొత్తగా 149 పీహెచ్‌సీలు నిర్మించడంతో పాటు, దాదాపు 1,138 పీహెచ్‌సీల్లో మార్పులు చేస్తున్నాం., ఇందు కోసం రూ.671 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. వాటిని కూడా మార్చి నాటికి పూర్తి చేస్తాం. 52 ఏరియా ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం కోసం రూ.695 కోట్లతో టెండర్లు, 169 సీహెచ్‌సీల రూపురేఖల మార్పు కోసం రూ.541 కోట్లతో టెండర్లను 15 రోజుల్లో పిలుస్తారు.

టీచింగ్‌ ఆస్పత్రులు
ఇప్పుడున్న 11 టీచింగ్‌ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం, కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రుల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులకు ఆగస్టులో టెండర్లు పిలుస్తాం. రూ.12,270 కోట్ల ఖర్చుతో ఆ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తాం. 

1,060 కొత్త అంబులెన్సులు..
108, 104 సర్వీసులు కూడా మారుస్తున్నాం.. జూలై 1న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఒకేసారి 1,060 కొత్త అంబులెన్సులను (108, 104 సర్వీసులు) జెండా ఊపి ప్రారంభిస్తాం. 

వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌..
కోవిడ్‌ సమయంలో ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌కు శ్రీకారం చుట్టాం. 14410 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. ఈ సేవల కోసం దాదాపు 300 మంది వైద్యులు పని చేస్తున్నారు. మిస్డ్‌ కాల్‌ రాగానే, సెంటర్‌ నుంచి తిరిగి ఫోన్‌ చేస్తారు. రోగి వివరాలు తెలుసుకుని వెద్యులు మందులు ప్రిస్క్రైబ్‌ చేస్తారు. ఆ మందులను మర్నాడే రోగి ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తారు. జూలై 1 నుంచి ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్, థర్మో బ్యాగ్‌ కూడా సమకూరుస్తున్నాం. దీంతో రోగి ఇంటికే వెళ్లి వేగంగా మందులు ఇస్తారు. 

వారంలో నోటిఫికేషన్‌
ఆస్పత్రుల్లో మెరుగైన సేవల కోసం సిబ్బందిని నియమిస్తున్నాం. 9712 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకానికి వారం రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. నెలన్నర వ్యవధిలో నియామకాలు పూర్తవుతాయి. సదస్సులో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా
గతంలో చేయి విరిగితే ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తారా? అనే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేయడంతో పాటు విశ్రాంతి అవసరమైన సమయంలో కూడా ఆర్థిక సహాయం ఇస్తున్నాం

బాధితులకు పెన్షన్లు
తొమ్మిది రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి నెలకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్‌ ఇస్తున్నాం. కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేలు ఇస్తున్నాం. బోదకాలు, పక్షవాతం, గుండె ఆపరేషన్, కిడ్నీ మార్పిడి, తలసేమియా, డయాలసిస్‌ రోగులు, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీ మియా బాధితులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛను వలం టీర్ల ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ చేస్తున్నాం.  

రెండు వారాల్లో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు
ప్రతి కుటుంబానికి  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం.  రాష్ట్రంలో 1.42 కోట్ల మందికి కార్డులు ఇవ్వా ల్సి ఉండగా ఇప్పటికే 1.33 కోట్ల మందికి ఇచ్చాం. మిగిలిన వారికి మరో 2 వారాల్లో అందజేస్తాం. కోవిడ్‌ వల్ల జాప్యం జరిగింది.

ఆస్పత్రుల్లో ఔషధాలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో మందులు తీసుకోవాలంటే భయంగా ఉండేది. గతంలో ఆస్పత్రుల్లో 230 రకాల మందులు ఉంటే 500 రకాలకు పెంచాం. గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ (జీఎంపీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ్య హెచ్‌ఓ) ప్రమాణాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచాం. ఎన్‌ఈబీఎల్‌ ల్యాబ్‌లు 4 నుంచి 6కు పెంచాం. మూడు ప్రాంతీయ డ్రగ్‌ స్టోర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశాం. 

వైఎస్సార్‌ కంటి వెలుగు..
ఈ ఏడాది కాలంలో ఆరోగ్యశ్రీకి మెరుగు దిద్దిన కార్యక్రమాల్లో నా మనసుకు నచ్చింది కంటి వెలుగు. రాష్ట్రంలో ఉన్నవారందరికీ కంటి వైద్య పరీక్షల కోసం రూ.560 కోట్లతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తొలుత దాదాపు 70 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశాం. 4.36 లక్షల మంది పిల్లలకు దృష్టి లోపం ఉందని గుర్తించారు. 1.58 లక్షల మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరమని తేల్చగా 1.29 లక్షల మందికి పంపిణీ చేశాం. స్కూళ్లు తెరవగానే మిగిలిన వారికి ఇస్తాం. దాదాపు 46 వేల మంది పిల్లలకు దసరా సెలవుల్లో ఆపరేషన్లు చేయిస్తాం. 

ఇంటింటి సర్వేతో కరోనా కట్టడి..
డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ హోదాలో వైఎస్సార్‌ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పన, అమలులో పాలుపంచుకున్నా. కోవిడ్‌ విస్తరించకుండా మీరు తీసుకున్న చర్యలు బాగున్నాయి. ఇంటింటి సర్వే ద్వారా ఏపీ అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా వ్యవహరించింది. 
– డాక్టర్‌ ఐవీ రావు, మాజీ వైస్‌ చాన్స్‌లర్, ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌  

ఖరీదైన మందులిచ్చి కాపాడుతున్నారు..
వైఎస్సార్‌ చొరవతో ఏర్పాటైన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా 270 రకాల కేన్సర్లకు చికిత్స చేయగలుగుతున్నాం. త్రీడీసీఆర్టీ ట్రీట్‌మెంట్‌ ఆరోగ్యశ్రీలో ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ట్యూమర్‌ బోర్డును మన రాష్ట్రంలో ప్రప్రథమంగా తెచ్చాం. బ్రెస్ట్‌ కేన్సర్‌లో రూ.25 లక్షలు ఖర్చయ్యే ట్రాస్టిజమేబ్‌ అనే మందు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఇస్తున్నాం. లింఫోమాస్, రిటెక్స్‌మాబ్‌ అనే మందులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఇస్తున్నాం. ప్రపంచంలో ఎవరికీ ఈ అవకాశం దక్కదు.
– డాక్టర్‌ రఘునాధరావు, ఫౌండర్‌ డైరెక్టర్, హోమీబాబా కేన్సర్‌  ఆసుపత్రి, విశాఖపట్నం.

బాలింతలకు బాసట..
మా ఏజెన్సీలో శిశుమరణాలు, బాలింత మరణాలు గతంలో ఎక్కువగా ఉండేవి. మీరు వచ్చిన తర్వాత వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డకు జన్మనిస్తున్నారు.  
– సత్యవాణి, అడ్డతీగల, రాజవొమ్మంగి, ఐసీడీఎస్‌ వర్కర్‌

తలసేమియా చిన్నారికి భరోసా 
మా పాప హాసిని తలసే మియా బాధితురాలు. పింఛన్‌ వస్తోంది. ఉచిత వైద్యం మాత్రమే కాకుండా నేనున్నానని భరోసా ఇచ్చారు. మీరు మా ఆశాజ్యోతి. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మం దులు విరివిగా దొరికేలా చూడాలి’  
– హేమ
దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ థలసేమియా పేషెంట్లకు మందులు హోం డెలివరీ చేసే దిశగా ఆలోచించడం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు