తెలుగు తప్పనిసరి సబ్జెక్టు: సీఎం జగన్‌

12 Nov, 2019 14:32 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రాసే స్థాయికి మన విద్యార్థులు చేరుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నాడు- నేడు కార్యక్రమాన్ని కలెక్టర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారమిక్కడ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవంబర్‌ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి దశలో 15 వేలకు పైగా పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన ఉంటుందన్నారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది తదుపరి తరగతుల్లో ఇంగ్లీషు విద్యా బోధన ప్రవేశపెడతామని.. అయితే తెలుగు తప్పనిసరి సబ్జెక్టు అన్నారు.

‘జనవరి 1 నుంచి టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్స్‌ కూడా ఉండాలి. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్‌ పనులు, మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, హైస్కూల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం.. ఇవన్నీ నాడు- నేడు కార్యక్రమంలో భాగమే. తల్లిదండ్రులతో ఏర్పడ్డ కమిటీల భాగస్వామ్యం తీసుకోండి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. డిసెంబర్‌లోగా పాఠ్యాప్రణాళిక ఖరారు చేయాలి’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

కఠిన చర్యలు తప్పవు..
నవంబర్‌ 14 నుంచి 21 వరకూ ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అక్రమ రవాణా, ప్రకటించిన ధరలకు మించి ఎవరైనా ఇసుక అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ‘వరదల వల్ల ఇసుక రీచ్‌లు మునిగిపోయిన కారణంగా... డిమాండ్‌ను చేరుకోలేకపోయాం. గత వారం రోజులుగా ఈ పరిస్థితి మెరుగుడు పడింది. 1.20 లక్షల టన్నులకు రోజువారీ డిమాండ్‌ పెరిగింది. రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కిపైగా చేరింది. వచ్చే వారంరోజుల్లోగా 1.2లక్షల టన్నులను 2 లక్షల టన్నుల వరకూ పెంచాలి. 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయిట్లు పెంచాలి. ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఇవన్నీ చేయాలి. జేసీలను ఇన్‌ఛార్జీలుగా పెట్టాం కాబట్టి. వారు స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచాలి. వారోత్సవం అయ్యేలోపు 180కి పైగా స్టాక్‌ పాయింట్లు ఉండాలి. నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలి. రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్‌ చేయాలి. ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే పెనాల్టీతో పాటు సీజ్‌ చేయడమే కాకుండా.. రెండేళ్ల వరకూ జైలుశిక్ష ఉంటుంది. దీనికి రేపు కేబినెట్‌ ఆమోదం కూడా తీసుకుంటాం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అదే విధంగా... జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయాలని... ఇసుక కొరత తీరేంత వరకూ ఎవ్వరూ కూడా సెలవులు తీసుకోకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ‘ఇసుక తవ్వకాల్లోగానీ, విక్రయాల్లోగానీ సిబ్బంది సెలవులు తీసుకోకుండా పనిచేయాలి. సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నరూట్లు, పెద్ద రూట్లలో చెక్‌పోస్టులు పెట్టాలి. వీడియో కెమెరాలు పెట్టాలి.10 రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికావాలి. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌ అండ్‌ బి, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు