మద్యం, ఇసుక మాఫియాలపై ఉక్కుపాదం

10 May, 2020 04:19 IST|Sakshi

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు 

మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: మద్యపాన నియంత్రణ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇసుక అక్రమాలు, మాఫియాలను నివారించేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. తాజాగా ఈ రెండు విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (మద్యం, ఇసుక)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

సరిహద్దుల రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా.. రాష్ట్రంలో నాటుసారా రూపంలో మద్యం తయారు కాకుండా చూడటం, ఇసుక అక్రమాలను నిరోధించడమే లక్ష్యంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పనిచేస్తుంది. ఈ రెండు అంశాలపై ఉక్కుపాదం మోపేలా ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని, దాని రూపురేఖలపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ సహా కీలక అధికారులతో నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీనిపై సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. శుక్రవారం మరోసారి అధికారులతో సమావేశమై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 

స్వరూపం ఇలా.. 
► ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సాధారణ పరిపాలన శాఖలో భాగంగా ఉంటుంది. 
► ఈ విభాగానికి అధిపతిగా డీజీపీ వ్యవహరిస్తారు. ఎక్స్‌ అఫీషియో ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయనే ఉంటారు. 
► ఎక్స్‌ ఆఫీషియో ముఖ్య కార్యదర్శికి విధుల్లో సహకారం అందించేందుకు మధ్య స్థాయి అధికారి ఒకరు, సహాయ అధికా రి ఒకరు, రెండు సెక్షన్లు ఉంటాయి. 
► స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు కమిషనరేట్‌ కూడా ఉంటుంది. దీనికి అధిపతిగా ఐజీ స్థాయి ఆపై అధికారి ఉంటారు. 
► ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ లేదా ఏఎస్పీతో ఈ బ్యూరో ఉంటుంది. ఇందులో 18 మంది పోలీసు అధికారులు ఉంటారు. ఏడుగురు కేడర్‌ స్థాయి అధికారులు, మిగిలిన వారు నాన్‌ కేడర్‌ స్థాయి వారు ఉంటారు.  
► కమిషనరేట్‌ స్ట్రక్చర్, ఉద్యోగులు, 18 మంది పోలీసు అధికారులకు సంబంధించి విధి, విధానాలను నిర్ధారిస్తూ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. 
► కొత్తగా ఏర్పాటు చేసిన ఈ శాఖకు సంబంధించి అవసరమైన చట్టాలను సవరిస్తారు. దీనికి సంబంధించి రెవెన్యూ, పరిశ్రమలు, వాణిజ్య, ఆర్థిక శాఖలు చర్యలు తీసుకోవాలి.  

మరిన్ని వార్తలు