మీరొచ్చి నాలో ధైర్యం నింపారు: మధులత

16 Sep, 2019 13:32 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి : బోటు ప్రమాద బాధితులందరికీ.. మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యులను ఆదేశించారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే వాళ్లందరినీ ఇళ్లకు పంపించాలని సూచించారు. బోటు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరించి... బాధితుల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని.. అందిరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన మధులత సీఎం ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. తన భర్త సుబ్రహ్మణ్యంతో పాటు, కుమార్తె హాసిని మరణించారని..తాను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నన్ను డాక్టర్లు బతికించారు. నా భర్త ఎప్పుడూ మీ గురించే చెప్పేవారు. కష్టాల్లో గుండె ధైర్యం తెచ్చుకుని ఎలా బతకాలో.. చెప్తూ మీ గురించి తరచుగా ప్రస్తావించేవారు. ఇప్పుడు మీరొచ్చి నాలో ధైర్యాన్ని నింపారు’ అని సీఎం జగన్‌ ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు.

కాగా తెలంగాణలోని చిట్యాల మండలం వన్నిపాకంకు చెందిన బాధితులను కూడా సీఎం జగన్‌ పరామర్శించారు. ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన జానకి రామారావుకు ధైర్యం చెప్పారు. వరంగల్‌ జిల్లా కరిపికొండెం  బాధితులను కూడా పరామర్శించి.. అందరికీ మంచి వైద్యం అందించాలని వైదుల్యకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా ఆస్పత్రి వద్దే సీఎం కలిశారు. మృతదేహాలు గ్రామాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు కన్నబాబు, ఆళ్లనాని, పినిపె విశ్వరూప్, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎంపీ మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. (చదవండి: బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ)

మరిన్ని వార్తలు