ఎండిన గొంతులు తడిపేందుకే..

9 Jun, 2020 03:48 IST|Sakshi

శ్రీశైలంలో నీటిమట్టం 881 అడుగులు ఉంటేనే ‘పోతిరెడ్డిపాడు’ ద్వారా సామర్థ్యం మేరకు నీటి వినియోగం

854 అడుగులుంటే 7వేల క్యూసెక్కులే వాడుకునే అవకాశం

అంతకంటే తగ్గితే కేటాయింపులున్నా వినియోగించుకునే అవకాశం ఉండదు

ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగదు

కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతోంది.. దీంతో అదనంగా 100 టీఎంసీలు నిల్వ 

అప్పుడు శ్రీశైలానికి మరింత ఆలస్యంగా వరద 

ఈ అంశాలు వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాయండి

జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కారణమిదే

సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమలో ఎండిన గొంతులు తడిపేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మా వాటా నీళ్లను వాడుకోవడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టంచేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా,  గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల మీద రెండు రాష్ట్రాలు ఆయా బోర్డులకు ఇటీవల పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో ఈనెల 4న కృష్ణా బోర్డు.. 5న గోదావరి బోర్డు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాల్సిన ఆవశ్యకతను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి లేఖ రాయాలని సీఎం వారిని ఆదేశించారు. లేఖలో పొందుపర్చాలంటూ ముఖ్యమంత్రి సూచించిన ముఖ్యాంశాలు ఇవీ..

► ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు కర్ణాటక పెంచుతుండటంవల్ల అదనంగా దాదాపు 100 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత జాప్యం జరుగుతుంది. 
► విభజన తర్వాత తెలంగాణ సర్కార్‌ కృష్ణాపై చేపట్టిన కొత్త ప్రాజెక్టులు. 
► కృష్ణాకు వరద రోజులు తగ్గాయి. అలాగే, ఒకేసారి భారీగా వరద వస్తున్న అంశం.
► శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 881 అడుగుల్లో ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్‌ ప్రకారం పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించే అవకాశం ఉంది. కానీ, ఆ స్థాయిలో నీటి మట్టం పది రోజులు కూడా ఉండదు.
► నీటి మట్టం 854 అడుగులు ఉంటే కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకునే అవకాశం ఉండదు. 
► అందుకే 800 అడుగుల నుంచి నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం.
► కానీ, శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్‌ నీటిని తరలిస్తోంది. 796 అడుగుల నుంచి ఎడమగట్టు విద్యదుత్పత్తి కేంద్రం ద్వారా 42 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం తెలంగాణకు ఉంది. 
► తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తరలిస్తున్నప్పుడు.. అదే స్థాయి నీటి మట్టం నుంచి, రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపడితే తప్పెలా అవుతుంది. 
► ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదు.
► అలాగే, రాయలసీమ ఎత్తిపోతలవల్ల పర్యావరణానికీ ఎలాంటి హాని కలగదు. మన వాటా నీటిని వినియోగించుకోవడానికే ఈ ప్రాజెక్టు చేపట్టాం.
► ఈ అంశాన్ని వివరిస్తూ ఎన్జీటీ (జాతీయ హరిత న్యాయస్థానం)లో పిటిషన్‌ దాఖలు చేయాలి.
అంతేకాక.. కేంద్ర జల్‌శక్తి శాఖ, ఎన్జీటీలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని.. రాయలసీమ ఎత్తిపోతల పనులకు టెండర్లు పిలిచి శరవేగంగా రాయలసీమ ప్రజల తాగునీటి కష్టాలను కడతేర్చాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.  

>
మరిన్ని వార్తలు