పోలవరం @ 2021

30 Apr, 2020 04:05 IST|Sakshi
ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వచ్చే సీజన్‌లో ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సిందే

ఇసుక, స్టీలు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలి

జూన్‌ ఆఖరుకు స్పిల్‌ వేను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి

వరద వచ్చేలోగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో పునరావాసం కల్పించాలి

మిగతా ప్రాంతాల్లో ఆరు ప్రాజెక్టులు ఈ ఏడాదే ప్రారంభం కావాలి

జల వనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, కాఫర్‌ డ్యామ్‌లు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌), కుడి, ఎడమ అనుసంధానాలు (కనెక్టివిటీస్‌), కుడి కాలువ, ఎడమ కాలువ, డిస్ట్రిబ్యూటరీలు, నిర్వాసితుల పునరావాసం తదితర విభాగాలకు సంబంధించి ప్రతి పనిని గడువులోగా పూర్తి చేయడానికి సూక్ష్మ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. దాన్ని అమలు చేయడం ద్వారా గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలి.

అవుకు టన్నెల్‌–2, వెలిగొండ తొలి దశ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈ ఆరు ప్రాజెక్టులు ఈ ఏడాదే ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలి. 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు వరదలు వచ్చేలోగా.. అంటే జూలైలోగా పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 

సిమెంట్, స్టీలు కొరత లేకుండా చూడండి 
► కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులకు నెల రోజులకుపైగా అంతరాయం కలిగిందని.. ప్రధానంగా సిమెంట్, స్టీల్‌ సరఫరాకు ఇబ్బంది ఏర్పడిందని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. 
► గత నెల 20 నుంచి పనుల పరిస్థితి మెరుగు పడిందన్నారు. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సిమెంట్, స్టీలు సరఫరా మొదలవు తోందని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వాటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

జూలైకి పునరావాసం పనులు పూర్తి కావాలి
► గోదావరికి వరదలు వచ్చేలోగా పోలవరం స్పిల్‌ వే పనులను జూన్‌ ఆఖరుకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.
► స్పిల్‌ వేను పూర్తి చేయకుండానే.. కాఫర్‌ డ్యామ్‌ల పనులు ప్రారంభించడం వల్ల గత ఏడాది గోదావరి వరద ప్రవాహానికి అడ్డంకి కలిగింది. ఫలితంగా పోలవరం వద్ద వరద మట్టం పెరిగి.. ముంపు గ్రామాల్లోకి నీరు చేరింది. అందువల్ల 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాల్లో నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించే
పనులను జూలై నాటికి పూర్తి చేయాలి.
► గోదావరికి వరదలు వచ్చే సమయంలో స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, కాఫర్‌ డ్యామ్‌ పనులు చేయలేం.. అందువల్ల అనుసంధానాలు, ఎడమ కాలువలో మిగిలిన పనులను వేగవంతం చేయాలి. 

డిజైన్లు ఆమోదింపజేసుకోవాలి
► స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, కాఫర్‌ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న డిజైన్లను సత్వరమే ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలి.
► గోదావరి వరదలు ముగిశాక స్పిల్‌ చానల్, కాఫర్‌ డ్యామ్‌లకు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ పనులు ప్రారంభించి, 2021 నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి.
► పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన రూ.2,748.7 కోట్లు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు పనులకే ఖర్చు చేయాలి.
► ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు