సత్యలీలకు 'ఆసరా' తొలి చెక్కు

3 Dec, 2019 04:36 IST|Sakshi
డేగల సత్యలీల

సాక్షి, గుంటూరు: ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని సోమవారం గుంటూరు జనరల్‌ ఆసుపత్రిలో ప్రారంభించిన అనంతరం రోగులకు సీఎం జగన్‌ చెక్కులను పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన డేగల సత్యలీలకు సీఎం తొలి చెక్కు అందించారు. ఆమె పది రోజుల క్రితం కూలి పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందారు. వైద్యుల సలహా మేరకు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం ఆమెకు రూ.10 వేలు చెల్లించింది. 

ఆరోగ్యం జాగ్రత్తమ్మా అన్నారు..
‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ కింద నీ ఆరోగ్యం మెరుగయ్యే వరకూ రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు ప్రభుత్వం నుంచి నీకు డబ్బులు వస్తాయి. తొలి చెక్కు నీకే అందిస్తున్నామమ్మా.. ఆరోగ్యం జాగ్రత్త అని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. కూలికి వెళ్తేగానీ ఇల్లు గడవని పరిస్థితి. పూర్తిగా కోలుకునే వరకూ డబ్బులిస్తామని సీఎం చెప్పారు. ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు రుణపడి ఉంటాను’ 
    – డేగల సత్యలీల, ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా

భరోసా కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు...
‘నా భర్త చనిపోవడంతో చెరుకు రసం అమ్ముకుంటూ జీవిస్తున్నా. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరగా కొద్ది  రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నాకు ముగ్గురు కుమార్తెలు. నేను ఖాళీగా ఉంటే పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితి. ఆరోగ్య ఆసరా పథకం కింద నాకు రూ.8 వేలు అందించారు. నువ్వు దిగులు పడొద్దమ్మా, నీ ఆరోగ్యం కుదుటపడే వరకు ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. నాకు, నా పిల్లలకు ఆరోగ్య భరోసా కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు.    
– షేక్‌ ఇస్మాల్‌ బీ, కొత్తపేట, గుంటూరు

అన్నం పెడుతున్న ‘ఆసరా’
వైఎస్సార్‌ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నాకు బ్రెయిన్‌ ట్యూమర్‌కు ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. కొంతకాలం బాగున్నా తిరగబెట్టడంతో ఇబ్బందిపడుతున్నా. ఆపరేషన్‌ చేయించుకున్నవారికి వైఎస్సార్‌ ఆసరా ద్వారా భృతి చెల్లించడం వల్ల కడుపు నిండా అన్నం తినగలిగే అవకాశం కలిగింది. మాలాంటి పేదల కోసం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలి.
– షేక్‌ మున్నీ, ఆరోగ్య ఆసరా లబ్ధిదారు, గుంటూరు

ఊహించనంత సాయం...
నా భర్త గుడిపూడి నాగరాజుకు గుండెనొప్పి రావడంతో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. పనికి వెళ్లకుంటే ఇల్లు ఎలా గడవాలని ఆలోచిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ ‘ఆసరా’ ద్వారా మాలాంటి పేదలను ఆదుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సాయం అందుతుందని ఊహించలేదు. మాలాంటి పేదల కోసం ఎల్లప్పుడూ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్షాలు ఎలా ఎక్కువగా ఉన్నాయో ఈ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి.     
    – మణికుమారి, వేములూరిపాడు,ఫిరంగిపురం మండలం

నెల కాదు.. ఆర్నెల్లు ‘ఆసరా’
బండి వెంకన్న పరిస్థితిపై తక్షణమే స్పందించిన సీఎం
జీబీ సిండ్రోమ్‌ (గులియన్‌ బెరీ సిడ్రోమ్‌) వ్యాధితో బాధపడుతున్న బండి వెంకన్నకు ఆర్నెల్ల పాటు ‘ఆసరా’ ద్వారా సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన వెంకన్న శరీరం మొత్తం ఈ వ్యాధి వల్ల పక్షవాతానికి గురైంది. చికిత్స కోసం ఆయన కుటుంబం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేసింది. గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు అందించిన చికిత్స వల్ల పది రోజుల్లోనే వెంకన్న శరీరం, చేతుల్లో కదలిక వచ్చింది. వైద్యుల సలహా మేరకు వెంకన్నకు నెల రోజుల పాటు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా చెక్కును ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు సిద్ధం చేసింది. ఈ చెక్కును సీఎం చేతులమీదుగా ఇచ్చే సమయంలో వెంకన్న పరిస్థితిని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సుందరాచారి వివరించారు. వెంకన్న కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. ఆరోగ్య ఆసరా సాయాన్ని ఆ మేరకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. 

సీఎంకు నర్సుల సంఘం వినతి 
గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా చెక్కుల పంపిణీ అనంతరం ప్రభుత్వ నర్సుల సంఘం సభ్యులు తమ సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. జీజీహెచ్‌లో నర్సుల కొరత, ప్రోత్సాహకాలు అందక ఇబ్బందులు పడుతున్నట్టు నివేదించారు.

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
పేదలకు అండగా నిలవటం, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉండగాఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. నిధులు పక్కదారి పట్టించి పేదల మరణాలకు కారణమయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి పరిధి రూ.5 లక్షల వరకు పెంచారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల విస్తృతి పెంచారు. మూడు మహానగరాల్లో పేదలు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రకటించి ఆపరేషన్‌ చేయించుకున్న కుటుంబాలను పోషించే బాధ్యత స్వీకరించారు.
– ఆళ్ళ నాని,ఉప ముఖ్యమంత్రి 

సంక్షేమ పథకాలతో చరిత్ర 
సీఎం జగన్‌ సంక్షేమ కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తున్నారు. గత ఐదేళ్లలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి అన్ని వ్యాధులకు వర్తింపచేస్తున్నారు. మంచాన పడిన పేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలుస్తారు.
    – మోపిదేవి, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి 

అంతా గర్వపడేలా చేశారు..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపరేషన్‌ చేయించుకున్నవారికి వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా జీవన భృతిని ముఖ్యమంత్రి జగన్‌ అందజేస్తున్నారు. ఆరు నెలల పాలనలో అందరూ ఎంతో గర్వపడేలా చేశారు. ప్రతి వారం ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి రికార్డు సృష్టిస్తున్నారు. విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం ఎన్నడూ లేనంత ప్రాధాన్యం కల్పించింది.
– మేకతోటి సుచరిత, హోంశాఖ మంత్రి 

మరిన్ని వార్తలు