సామాన్యుడి వద్దకు సర్కారు

3 Oct, 2019 04:34 IST|Sakshi
విశాఖ జిల్లా గంభీరంలో గ్రామ సచివాలయంపై నవరత్న పథకాలు

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాక్షాత్కారం 

సచివాలయాల ప్రారంభోత్సవాలతో రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరం.. అన్ని వర్గాల ప్రజల సాక్షిగా అపూర్వ ఘట్టం ఆవిష్కృతం 

ఇక కూతవేటు దూరంలోనే వందలాది సేవలు

‘‘నాకో కల ఉంది.. పేదల ముఖంలో సంతోషం చూడాలని. నాకో కల ఉంది.. రైతులందరూ సుఖ సంతోషాలతో గడపాలని. నాకో కల ఉంది.. లంచాలు, అవినీతి లేని సమాజాన్ని తేవాలని. నాకో కల ఉంది.. నిరక్షరాస్యులే ఉండకూడదు.. చదువుకున్న యువతకు ఉపాధికి ఢోకా ఉండకూడదని’ అంటూ మొన్న అమెరికాలో సీఎం జగన్‌ చెప్పడం విన్నాం. ఈ రోజు ఆయన కల సాకారం చేసుకునే దిశగా అడుగులేశారు.
ఆ అడుగు జాడల్లో నడిచేందుకు మేమంతా సిద్ధం.’’
  
 – కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలువురు యువకులు 

‘‘వైఎస్‌ జగన్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, పేదవాడికి సంక్షేమ పథకాలు చేర్చడంలో నిజాయితీగా పని చేస్తాం. ఇది మా ఆన’ అంటూ రాజధాని ప్రాంతానికి సమీపంలోని గొల్లపూడి, కంచికచర్లలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన యువత ప్రతిజ్ఞ చేశారు’’. 

‘మా ప్రభుత్వం వచ్చిందయ్యా.. మా పల్లెకే పాలన తెచ్చిందయ్యా..’ అంటూ అన్ని వర్గాల ప్రజలు మమేకమైన అపురూప సన్నివేశాలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కనువిందు చేశాయి. జాతర వస్తే ఊరంతా సందడి చేసినట్లు, పండుగొస్తే అందరూ కలసి ఆనందం పంచుకున్నట్టు ఊరూవాడా ఏకమై కదిలింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు రాష్ట్ర ప్రజలు బుధవారం మనస్ఫూర్తిగా సమష్టిగా ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ ముంగిటకే పాలనా వ్యవస్థను తీసుకురావడంతో అంతటా సంబరాలు చేసుకున్నారు. అటు అనంతపురం, కర్నూలు మొదలు మధ్యలో రాజధాని ప్రాంతం.. చివరనున్న విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని మారుమూల పల్లెల వరకూ అదే పండుగ వాతావరణం వెల్లివిరిసింది. 
– ప్రజా క్షేత్రం నుంచి సాక్షి అమరావతి ప్రతినిధుల బృందం

సచివాలయాల్లో నవతరం
‘గాంధీ 150వ జయంతి సందర్భంగా ఓ పక్క వందేమాతరం గీతాలాపన, మరోపక్క పల్లె పాలన ఆవిష్కృత కేరింతలతో రాయలసీమ బుధవారం మార్మోగింది. పల్లెలు కళకళలాడాయి. వార్డులు కొత్త శోభను సంతరించుకున్నాయి. దసరా ముందే వచ్చేసిందా అన్నట్టు ఆట పాటలు, తీన్మార్‌ నృత్యాలతో హోరెత్తాయి. పల్లెల సమగ్రాభివద్ధి, పౌర సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన వెంటనే సీమలోని 52 నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్‌సీలు ఆయా ప్రాంతాలలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.   గ్రామాల్లో ఎటుచూసినా సందడే సందడి. ఉత్సాహ, ఉద్వేగభరిత వాతావరణమే. కరచాలనాలు, పరస్పరం అభినందనలు, ఆలింగనాలు, సెల్ఫీలు, కుశల ప్రశ్నలు.. నీ పోస్టింగ్‌ ఎక్కడ? నీ సీటు ఎక్కడంటూ ప్రశ్నల పరంపరలు.. ఉన్నతాధికారుల హడావిడి మధ్య ప్రతి చోటా పండగ వాతావరణమే. ఎటుచూసినా ఫుల్‌ జోష్‌. ‘గ్రామ స్వరాజ్యం, గ్రామ పాలన అంటూ 40, 50 ఏళ్లుగా వింటున్నామే తప్ప అదెలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నా అన్నారు అనంతపురం నగరానికి చెందిన 65 ఏళ్ల డి.వెంకటప్పయ్య.  ఇది దేశ చరిత్రలోనే అరుదైన రికార్డు అని వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన సుధీర్‌రెడ్డి చెప్పారు.

గ్రామ స్వరాజ్యం అనేది ఓ సుపరిపాలనా ప్రక్రియ అని, ఇందులో పాల్గొంటున్న వారందరూ చరితార్ధులేనని చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన చంద్రయ్య యాదవ్‌ కీర్తించారు. బడుగు, బలహీనవర్గాలు, మహిళలు, చిన్న సన్నకారు, అల్పాదాయ వర్గాలు సహా అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో గ్రామ సచివాలయాలు తోడ్పడతాయని కర్నూలు జిల్లా పెద్దపాడు పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య అన్నారు. జగనన్న చెప్పినట్లు గ్రామీణ పేదల జీవితాల్లో మార్పు తేవడమే తమ లక్ష్యమని మహిళా పోలీసు, సహాయకురాలిగా ఎంపికైన కోడుమూరు యువతి శ్రీలత,  టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఎంపికైన జాఫర్, ఇతర ఉద్యోగాలు సాధించిన వెంకటేశ్, ఆర్‌.రవికుమార్, సంగా కిషోర్‌ శపథం చేశారు. 

చిన్న వయసులో పెద్ద బాధ్యత
‘నాకు 20 సంవత్సరాలు.. డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. నేను 40 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తాను. 25 ఏళ్ల లోపు వయసున్న వారెందరో ప్రస్తుత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అందరిదీ ఒక్కటే అభిప్రాయం.. అదేమంటే జగనన్న ఆశయ సిద్ధి కోసం కృషి చేయడం’ అని నెల్లూరు జిల్లాకు చెందిన ఎంఎస్‌ సాయి శరత్‌ అన్నారు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సాధించిన శ్రావణి కూడా ఇదే మాట అంది. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం గ్రామ సచివాలయ కార్యాలయంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది 25 సంవత్సరాలలోపు వారే. ‘ఈ రోజు కొంత మంది లబ్ధిదారులు గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు మాకు వివరించారు. వాటిన్నంటినీ చిన్న వయసులోనే పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం’ అని వారు అన్నారు. ‘వైఎస్‌ జగన్‌ చేతల సీఎం అని నిరూపించుకున్నారన్నారు. 

సీఎం సార్‌.. థాంక్యూ   
ఉభయ గోదావరి జిల్లాల్లో తాజాగా సచివాలయ ఉద్యోగాలు పొందిన వారందరిదీ ఇదే మాట. బుధవారం సచివాలయాల ప్రారంభోత్సవానికి తరలి వచ్చిన యువత, వారి తల్లిదండ్రులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. వైఎస్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయాలను ప్రశంసించారు. ఉన్న ఊరికి దగ్గర్లోŠ.. కన్నవారి కళ్ల ముందే ప్రభుత్వ కొలువుకు సిద్ధమైన యువత ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు థాంక్యూ సీఎం సార్‌ అంటూ నిండు మనస్సుతో చెబుతున్నారు. తమ బిడ్డలకు మంచి భవిష్యత్‌ కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌కు పలువురు తల్లిదండ్రులు రుణపడి ఉంటామని చెప్పారు. ‘సొంతంగా ఇంటి జాగా కూడా లేని మేము కాయ కష్టం చేసి మా బిడ్డలను చదివించాం. కొడుక్కు ఉద్యోగం రాకపోతుందా? మా కష్టాలు తీరకపోతాయా? అని ఐదేళ్లుగా కన్న కలలు ఈ రోజు నిజమయ్యాయి’ అని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించిన సురేష్‌ తల్లి నామవరపు లక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది. ‘ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా నా కుమారుడు వెంకన్న నాయుడికి ఈరోజు ఉద్యోగం వచ్చిందంటే కారణం సీఎం జగనే’ అని రేకపల్లి నారాయణ అన్నారు. 
కృష్ణాజిల్లా గొల్లపూడిలో ప్రతిజ్ఞ చేస్తున్న నూతన సచివాలయ ఉద్యోగులు 

‘‘అది రాజధాని ప్రాంతానికి సమీపంలోని చిల్లకల్లు గ్రామ సచివాలయం.. కూలి పని చేసుకునే కుటుంబానికి చెందిన పల్లవి అక్కడికొచ్చింది.. ‘ఐదేళ్లుగా ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. మా అమ్మ అనారోగ్యంతో ఉంటూ కూడా కూలి పని చేసి నా కోచింగ్‌ కోసం డబ్బులిచ్చింది. ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా గుండె తరుక్కుపోయేది సార్‌.. జగనన్న నెల రోజుల్లోనే పరీక్ష పెట్టి, మాకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చాడు సార్‌. గ్రామ స్వరాజ్య వ్యవస్థలో నేను కూడా భాగస్వామి అవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని భావోద్వేగంతో చెప్పింది’’.

యువతోత్సాహం 
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవాన్ని ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తప్పెట గుళ్లు, కోలాటాలతో సందడి చేశారు. నవరత్నాల పథకాలను గ్రామ సచివాలయం గోడ మీద అందంగా చిత్రీకరించారు. విజయనగరం జిల్లా అంతటా ఇదే సందడి కనిపించింది. ఎల్‌.కోటలో ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలపట్ల అవగాహన కల్పించడం అందర్నీ ఆకర్షించింది. ఎలాంటి సిఫార్సులతో నిమిత్తం లేకుండా ప్రతిభ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయడంతో యువత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉత్సాహంతో యువత గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవంలో పాల్గొంటూ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతను ప్రదర్శించింది.

శ్రీకాకుళం జిల్లాలోనూ అదే ఉత్సాహం సర్వత్రా తొణికిసలాడింది. గాంధీ జయంతి రోజున నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చిందని ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పల్లెలు, వాడల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ‘జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అగత్యం తప్పింది. 72 గంటల్లో స్థానికంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’ అని ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హెచ్‌.సుబ్రహ్మణ్యం అన్నారు.

గాంధీజీ ఉండుంటే ఎంత సంతోష పడేవారో..  
‘బాపూజీ జయంతి అంటే ఆయన చిత్ర పటానికి దండేసి దండం పెట్టడమే తెలుసు. అన్ని చోట్ల ఈసారి భిన్నంగా కన్పించింది. నిజంగా ఆయన బతికొచ్చినట్టుంది. ఇప్పుడు ఆయనే గనుక బతికి ఉండుంటే ఎంతగానో సంతోషపడేవారు’ అని గొల్లపూడి పంచాయతీ దగ్గర 70 ఏళ్ల పోల రంగయ్య భావోద్వేగంతో మాట్లాడారు. కృష్ణా జిల్లా గొల్లపూడి, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, చిల్లకల్లు, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో జనం గుండెలోతుల్లోంచి ఇవే మాటలు వచ్చాయి. గొల్లపూడిలో దళిత కుటుంబానికి చెందిన 68 ఏళ్ల సారయ్య కొత్త దుస్తులేసుకుని గ్రామ సచివాలయం వద్ద కొచ్చాడు. అక్కడ కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయం సిబ్బందిని చూస్తూ పరవశించిపోయాడు.  ‘దిక్కులేదయ్యా! కూలీ చేసి పొట్టపోసుకుంటున్నాను. కూలిపోయే ఇంట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాను.

ఓ ఇల్లివ్వమని ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఇక్కడ చెబితే జగనన్న ఇల్లిస్తాడట కదాయ్యా’ అంటూ కొన్నాళ్ల క్రితం భర్తను కోల్పోయిన శంకులమ్మ కన్నీళ్లు కొంగుతో తుడుచుకుంటుండగా అక్కడున్నవాళ్లు ఓదార్చారు. ‘ఐదేళ్లుగా అయ్యా.. రేషన్‌ కార్డు అంటూ తిరుగుతున్నా..  ఇప్పుడు మా వూళ్లోనే.. మా బజారునే గ్రామ సచివాలయం పెట్టారు. ఇక నాకు కార్డు వస్తుంది’ అని పెనుగంచిప్రోలులో లక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది. వ్యవస్థనే కదిలించిన సీఎం సంకల్పానికి మేం ఆఖరి వరకూ అండగానే ఉంటాం’ అని గొల్లపూడిలో తేజస్వీ, మాలతిలత, దుర్గారాణి, మృదుల, శ్రీలక్ష్మి, హరికుమార్, శ్యామల, రవి, శిరీష, రుద్రలత అన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో మహిళలు సంబరాలు చేసుకున్నారు.  మహిళలు రంగవల్లులు దిద్ది పూలబాటలు వేశారు. ఒకరికొకరు తోడై ఆనందంగా ఆడిపాడారు.

మరిన్ని వార్తలు