తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: సీఎం జగన్‌

24 Jul, 2019 17:45 IST|Sakshi

పరిశ్రమలు రావని ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తోంది

ఉద్యోగాలు వస్తాయంటేనే స్థానికులు సహరిస్తారు: సీఎం

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు బిల్లుకు సభ ఆమోదం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన స్థానికులకు 75శాతం ఉద్యోగాల కల్పన చట్టంపై ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తచట్టం మూలంగా పరిశ్రమలు రావని, దాని వల్ల ఉద్యోగాలు కూడా రావని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా రూపొందించిన చట్టానికి బుధవారం ఏపీ శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. స్థానిక ప్రజల భవిష్యత్తున్ని దృష్టిలో ఉంచుకునే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. పరిశ్రమలు పెట్టేటప్పుడు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటేనే.. పరిశ్రమకు స్థానికులు సహకరిస్తారని అన్నారు.

ఫ్యాక్టరీలు, కర్మాగారాలు నిర్మించడం మూలంగా అక్కడి ప్రజలు భూములను కోల్పోవాల్సి ఉంటుందని, వారికి పునరావాసంలో భాగంగా అక్కడే ఉద్యోగాలు కల్పించే విధంగా చట్టాని తీసుకువచ్చామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం కల్పించిందన, వారి బాధలను తీర్చేం విధంగా ఈ చట్టానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. దీనిని తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిపక్షం వక్రీకరిస్తోందని మండిపడ్డారు. అలాగే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు  సీఎం వెల్లడించారు. పరిశ్రమల్లో ఉద్యోగులకు  కావాల్సిన నైపుణ్యాన్ని ఈ సెంటర్ల ద్వారా శిక్షణ ఇవ్వచ్చని తెలిపారు.

చట్టం ప్రకారం స్థానికులకు వెంటనే ఉద్యోగాలు కల్పించకపోతే.. మూడేళ్ల కాలపరిమితిలో కల్పించే వెసులుబాటు చట్టంలో ఉందన్నారు. అలాగే కరెంట్‌ ఒప్పందాల సమీక్షపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తే.. పరిశ్రమలకు అంతకంటే ఎక్కువ ధరలకు  కరెంట్‌  ఇవాల్సి ఉంటుందని వివరించారు. దీని వల్ల పరిశ్రమలు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుదన్నారు. అందుకే ఈ రెండు అంశాలను తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీఎం పేర్కొన్నారు.  రాష్ట్రంలో లంచాలు ఉండవని ప్రతి పారిశ్రామికవేత్తకు హామీ ఇస్తున్నాననీ వైఎస్‌ జగన్‌ సభలో ప్రకటించారు. 

మరిన్ని వార్తలు