పులుల సంఖ్య పెరగడం సంతోషం : సీఎం జగన్‌

29 Jul, 2019 16:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పులులు సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఏపీలో పులుల సంఖ్య 48కి చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పులుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మన జాతీయ జంతువు అయిన పులులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకోసం పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. 

కాగా, దేశంలో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవార ఉదయం ట్విటర్‌లో వెల్లడించారు. ‘దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయి. మొత్తం 2,967 పులులతో ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యమైన దేశంగా మారింద’ని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు