ప్రతిదీ వక్రీకరించడమేనా? 

12 Dec, 2019 04:53 IST|Sakshi

పేదలకు ఇంగ్లిష్‌ విద్యనందించే కార్యక్రమాన్నీ రాజకీయం చేయడమేనా బాబూ?

మీ హయాంలో బినామీ సంస్థ నారాయణతో ప్రైవేటు స్కూళ్లు పెట్టించి ప్రమోట్‌ చేశావు

అందుకోసం దగ్గరుండి ప్రభుత్వ పాఠశాలలను మూయించావు 

అన్నీ చర్చిద్దాం.. వాస్తవాలు బయటపెడదాం

ఇంగ్లిష్‌ మీడియం విద్యపై చంద్రబాబు విమర్శలకు దీటుగా బదులిచ్చిన సీఎం

సాక్షి, అమరావతి:  ఏ మంచి పనినైనా రాజకీయ కోణంలో వక్రీకరించడమే చంద్రబాబు నైజమని, ఆఖరుకు పేదలకు ఇంగ్లిష్‌ విద్యను అందించే మంచి కార్యక్రమాన్నీ రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. శాసనసభలో బుధవారం ఓ ప్రశ్నపై జరిగిన చర్చలో విపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలకు సీఎం దీటుగా బదులిచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

నువ్వు ఏం చేశావ్‌ బాబూ! 
పేదవాళ్లు ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనే విధానంపై చంద్రబాబు వైఖరి ఎలా ఉందో ఒక ఉదాహరణ చెబుతాను. తన హయాంలోనే ఇంగ్లిషు తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ఈ వ్యక్తి, ఇంగ్లిష్, తెలుగు రెండు మీడియాలు ఉండాలని చెప్పే ఈ వ్యక్తి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం శాతం ఎంతో చూడండి. తెలుగు మీడియం 65%. అంటే కేవలం 35% ఇంగ్లిష్‌ బడులు. అదే ప్రైవేటులో.. తన కేబినెట్‌లో ఉన్న బినామీ సంస్థ నారాయణను తీసుకొచ్చి పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో ప్రైవేటు స్కూళ్లు పెట్టించి ప్రమోట్‌ చేశారు.  

ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు.. 
ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లిష్‌ శాతం ఎంతో తెలుసా? 94 శాతం. ప్రభుత్వ పాఠశాలలను దగ్గరుండి నిర్వీర్యం చేసి, ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించడం.. ఇదీ చంద్రబాబు హయాంలో జరిగిన విధానం. ఇలా ఉంది కాబట్టే, భావి సమాజంతో మన పిల్లలు పోటీపడాలంటే.. ప్రభుత్వ పాఠశాలలు కూడా పైవేటు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లతో పోటీ పడే వాతావరణం రావాలి. మన పిల్లలు కూడా ఇంగ్లిష్‌ ఓ హక్కుగా నేర్చుకునే పరిస్థితి ఉండాలి. ఆ తపన, తాపత్రయంతో మన స్కూళ్లన్నింటినీ ఇంగ్లిష్‌ మీడియం చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని సగర్వంగా చెబుతున్నాం. చంద్రబాబుకు ఏది చేసినా అందులో రాజకీయమే కన్పిస్తుంది. వక్రీకరణే కన్పిస్తుంది.

రండి.. చర్చిద్దాం 
2017లో మేమేదో చెప్పామంటున్నారు. ఆ రోజు అధికారంలో ఉంది మీరు. ఎవరు ఏం చెప్పినా చెయ్యాలనుకుంటే ఎవరూ ఆపలేరు. ఎందుకు ఆ రోజు నిర్ణయం తీసుకోలేదని మీ మనస్సాక్షిని మీరు అడగాలి. ఊరికే ఏదో ఒక కారణం చెప్పాలి. ఒకరి మీద వేలెత్తి చూపాలి, జరగంది వక్రీకరించి చూపించాలనే మీ దిక్కుమాలిన ఆలోచనలను చూసి... 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే ఇలాంటి వ్యక్తా మాకు ఇన్నాళ్లూ ముఖ్యమంత్రిగా ఉందని రాష్ట్రమంతా సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలోకి వచ్చింది. ఇంగ్లిష్‌ మీడియంపై రేపు(గురువారం) సుదీర్ఘ చర్చ జరుగుతుంది. అటునుంచి చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడొచ్చు. ఇటునుంచి మావాళ్లూ మాట్లాడతారు. రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వ స్కూళ్లను కూడా మూయించిన చరిత్రపైనా చర్చిద్దాం.  

మరిన్ని వార్తలు