ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మోక్షం

2 Dec, 2019 04:24 IST|Sakshi
పోలవరం ఎడమ కాలువ

రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు గోదావరి వరద జలాలను తరలించి.. వాటిని సస్యశ్యామలం చేయడానికి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని గాడినపెట్టి ఆ కలను సాకారం చేసేందుకు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ పథకాన్ని దశల వారీగా కాకుండా ఒకేసారి చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని.. దాన్ని ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. దీంతో సుమారు రూ.16,546 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చి, టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ఇది పూర్తయితే.. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 63.20 టీఎంసీల గోదావరి జలాలను ఉత్తరాంధ్రలోని ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే, 1,200 గ్రామాల్లోని 30 లక్షల మందికి తాగునీరు అందించడానికి వీలు కలుగుతుంది. 
–సాక్షి, అమరావతి 

వైఎస్‌ హఠాన్మరణంతో గ్రహణం
కాగా, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకాన్ని జనవరి 2, 2009న చేపట్టారు. దీనిని వడివడిగా పూర్తిచేసేందుకు అప్పట్లో టెండర్లు కూడా పిలిచారు. కానీ.. సెప్టెంబర్‌ 2, 2009న ఆయన హఠాన్మరణం చెందడంతో అనంతరం ఆ టెండర్లను రద్దుచేశారు. ఈ నేపథ్యంలో.. మొన్నటి ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశ పనులకు రూ.2,022.20 కోట్లతో పరిపాలన అనుమతిచ్చిన టీడీపీ ప్రభుత్వం.. వాటిని రెండు ప్యాకేజీలుగా విభజించి 4.85 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ, పనులు ప్రారంభం కాలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. అధిక టెండర్లవల్ల ఖజానాపై భారీఎత్తున భారంపడటంతో వాటిని రద్దుచేయాలని ఆదేశించారు.     

ఇదీ పథకం..
- ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి.. సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారు. ఈ కాలువ 162.409 కి.మీల నుంచి రోజుకు సుమారు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున విశాఖ జిల్లా అనకాపల్లికి సమీపంలోని పాపయ్యపాలెం వరకు 23 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. 
ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్‌ కెనాల్‌ ద్వారా నీటిని 
తరలించి.. జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు.
పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, 106 కి.మీల పొడువున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్‌ వరకూ తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ ద్వారా తరలిస్తారు. 
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువలో 14 కి.మీ నుంచి తవ్వే లింక్‌ కెనాల్‌ ద్వారా నీటిని మళ్లీ తరలిస్తారు. భూదేవి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భూదేవి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. 
49.50 కి.మీ. నుంచి తవ్వే మరో లింక్‌ కెనాల్‌ ద్వారా నీటిని తరలించి.. వీఎన్‌ పురం వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్‌ పురం రిజర్వాయర్‌లోకి మళ్లీ ఎత్తిపోస్తారు.
- 73 కి.మీ. వద్ద నుంచి తవ్వే ఇంకో లింక్‌ కెనాల్‌ మీదుగా తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు.
ఇక 102 కి.మీ నుంచి తవ్వే లింక్‌ కెనాల్‌ ద్వారా నీటిని తరలించి.. కొండగండేరుడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్‌ వలస బ్రాంచ్‌ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్‌ కెనాల్, బూర్జవలస లిఫ్ట్‌ కెనాల్‌ ద్వారా 
ఆయకట్టుకు నీళ్లందిస్తారు.
- మొత్తం మీద ఈ పథకం ద్వారా విశాఖపట్నం జిల్లాలో 3.21 లక్షలు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు.  

మరిన్ని వార్తలు