కడప స్టీల్‌ ప్లాంట్‌కు 23 లేదా 24న సీఎం శంకుస్థాపన

5 Dec, 2019 04:05 IST|Sakshi

ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో యూనిట్‌ ఏర్పాటు 

ఇందుకోసం ఏపీ హై గ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు 

యూనిట్‌ నిర్మాణానికి తక్షణం రూ.62 కోట్లు విడుదల 

డీపీఆర్‌ బాధ్యత మెకాన్‌ సంస్థకు అప్పగింత 

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23 లేదా 24వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఈ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ, మైనింగ్‌ శాఖ కార్యదర్శి కె.రాంగోపాల్‌లను డైరెక్టర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఐదేళ్లు గడిచినా అది కార్యరూపం దాల్చకపోవడం తెలిసిందే.

కాగా రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్న వైఎస్‌ జగన్‌.. ఇందులో భాగంగా కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ దిశగా దృఢచిత్తంతో ముందుకు సాగుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించడమేగాక దీనికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేలా ఎన్‌ఎండీసీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం తక్షణం రూ.62 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్‌ ఏర్పాటుకు సేకరించిన 3,295 ఎకరాలను చదును చేసి అభివృద్ధి చేయడం, డీపీఆర్‌ నివేదిక, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌కు మూలధనం.. కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నారు.

నెలాఖరుకు డీపీఆర్‌..
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను తయారుచేసే బాధ్యతను మెకాన్‌ సంస్థకు అప్పగించినట్టు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరుకు నివేదిక వస్తుందని పేర్కొన్నారు. ఈ యూనిట్‌కు అవసరమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామన్నారు. పీపీపీ విధానంలో కంపెనీ ఏర్పాటు చేయడానికి వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఒకవేళ ప్రతిపాదిత పీపీపీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు