పేదింటి అక్కలకు ‘చేయూత’

11 Jun, 2020 03:26 IST|Sakshi

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళల కోసం ‘వైఎస్సార్‌ చేయూత’

మరో కొత్త పథకాన్ని నేడు మంత్రివర్గం ఆమోదించే అవకాశం

45 – 60 ఏళ్ల వయసు మహిళలకు రూ.75,000 ఆర్థిక సాయం

ఏటా రూ. 18,750 నాలుగేళ్ల పాటు ‘చేయూత’ సాయం

రాష్ట్రవ్యాప్తంగా లబ్ధి పొందే మహిళలు 24 లక్షలకుపైనే

ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ
45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు పెన్షన్లు అంటే వెటకారం చేశారు. అందులో ఉన్న స్ఫూర్తిని అర్ధం చేసుకోలేక పోయారు. అయినా వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ‘వైఎస్సార్‌ చేయూత’ తీసుకొస్తున్నాం. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కకు తోడుగా ఉంటాం. ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా చేస్తాం. ఏ కొందరికో అరకొరగా ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తెస్తాం. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కకు ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా రెండో సంవత్సరం నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం.

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్లిష్ట సమయంలోనూ మాట నిలబెట్టుకుంటూ మరో వాగ్దానాన్ని నెరవేర్చేందుకుసిద్ధమయ్యారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే పేదింటి అక్కలకు రెండో ఏడాది ఆరంభంలోనే ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందచేయనున్నారు. ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా 45 – 60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు ఉచితంగా అందజేసే పథకం అమలుకు గురువారం మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.19 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుందని అధికారులు అంచనా వేశారు. వచ్చే నాలుగేళ్లలో పథకం అమలుకు రూ.18,142.8 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు. 

బీసీ మహిళలు 15.26 లక్షల మంది..!
వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందజేస్తారు. ఏడాదికి రూ.4,535.70 కోట్ల చొప్పున నాలుగేళ్లలో ఈ పథకం కోసం మొత్తం రూ.18,142.8 కోట్లు ఖర్చు చేయనున్నారు.
– అధికారుల ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో 45 – 60 ఏళ్ల మహిళల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 5.89 లక్షల మంది ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గంలో 1.63 లక్షల మంది మహిళలు, బీసీ సామాజిక వర్గంలో 15.26 లక్షల మంది మహిళలు, మైనార్టీ సామాజిక వర్గంలో 1.40 లక్షల మంది మహిళలు ఉన్నట్లు తేలింది.

మహిళా సాధికారత దిశగా..
రాష్ట్రంలో మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత సాధించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వరుసగా వివిధ కార్యక్రమాలను చేపట్టి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. నిరుపేద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు కరోనా విపత్కర పరిస్థితులలోనూ ఏప్రిల్‌ 24వతేదీన వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం అమలుకు ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా 43 లక్షల మంది తల్లులకు ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రయోజనం చేకూర్చి పేదింటి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు ‘వసతి దీవెన’ ద్వారా ఆర్థిక ఆసరా అందించారు.

2020–21 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత చదువులు చదివే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ డబ్బులను కూడా నేరుగా తల్లుల ఖాతాలకే జమ చేస్తామని ప్రకటించారు. నామినేషన్‌ పనులు, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం తెచ్చారు. ఆడపిల్లలు చదువుకునేలా ప్రోత్సహించేందుకు మనబడి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు తెచ్చారు. ఇక వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జూలై 8వతేదీన దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు వారి పేరుతోనే అందచేయనున్నారు. ఇలా పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతలో దేశంలోనే ముందంజలో నిలిచింది.

మరిన్ని వార్తలు