విక్రయం వద్దు

26 May, 2020 02:54 IST|Sakshi

టీటీడీకి చెందిన 50 ఆస్తులను విక్రయించాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం

దానిని నిలిపివేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు

దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారం కోసం వాటిని పరిశీలించండి

మత పెద్దలు, భక్తులతో చర్చించండి

సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈఓకు ఆదేశం

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ)కి చెందిన 50 ఆస్తులను విక్రయించాలని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా దేవస్థానానికి చెందిన 50 ఆస్తులను విక్రయించాలని అప్పటి టీటీడీ పాలక మండలి తీర్మానించింది. దీనిని 2016, జనవరి 30న నిర్వహించిన సమావేశం (అజెండాలో సీరియల్‌ నంబర్‌ 253)లో ఆమోదించింది. కాగా, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని టీటీడీ పాలక మండలిని ఆదేశించింది.

ఆ ఆస్తులను దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారం తదితర అవసరాలకు టీటీడీ ఉపయోగించుకునే అంశంపై మత పెద్దలు, భక్తులు తదితరులతో చర్చించాలని సూచించింది. అంతవరకు ఆ ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను నిలుపుదల చేయాలని కోరింది. ఈ అంశంపై టీటీడీ ఈఓ తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు