నెలలో 15 రోజులు క్షేత్రస్థాయిలోనే..

2 Dec, 2019 03:42 IST|Sakshi

కలెక్టర్లకు సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ  

పరిపాలనలో కలెక్టర్లే నాకు కళ్లు, చెవులు  

వారానికి రెండుసార్లే వీడియో కాన్ఫరెన్స్‌లు 

వారానికి ఓ రోజు పల్లె నిద్ర చేయండి.. పథకాల 

అమలు, సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి 

ఇచ్చిన నిధులు సమర్థంగా ఖర్చు చేస్తే.. మళ్లీ నిధులు

కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ 

సాక్షి, అమరావతి : పరిపాలనలో జిల్లా కలెక్టర్లే తనకు కళ్లు, చెవులు వంటి వారని.. నెలలో 15 రోజులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యల పరిష్కారానికి వారు చొరవ చూపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కొంతమంది జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు ఎక్కువగా వెళ్లడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని.. ఈ పరిస్థితి వెంటనే మారాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదివారం స్పష్టమైన కార్యాచరణను నిర్దేశిస్తూ మార్గదర్శకాలు జారీచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ– అభివృద్ధి కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి మరోసారి కర్తవ్యబోధ చేశారు.  
 
క్షేత్రస్థాయి సమాచారమే మనకు కీలకం.. 

కలెక్టర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని.. వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సుల కంటే క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల వల్లే సరైన ఫీడ్‌ బ్యాక్‌ వస్తుందని.. ప్రజలు, లబ్ధిదారులు, ఇతర వర్గాల నుంచి వచ్చే సమాచారం చాలా కీలకమని ఆయన చెప్పారు.

ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి, వాటి తక్షణ పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు ఉపయోగపడతాయని సూచించారు. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని.. ఆస్పత్రులు, హాస్టళ్లు, పల్లెల్లో రాత్రి నిద్ర చేయాలని సూచించారు. ప్రతి కలెక్టర్‌ తప్పనిసరిగా వారంలో ఒకసారి జిల్లా కేంద్రం వెలుపల ఆసుపత్రులు, హాస్టళ్లలో ఎక్కడో ఒక చోట రాత్రి నిద్ర చేయాలన్నారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడతాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.  


 
ఇకపై వారానికి రెండుసార్లే వీడియో కాన్ఫరెన్స్‌ 
మండల స్థాయి అధికారులతో కలెక్టర్లు ఇక నుంచి వారానికి రెండుసార్లు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి. ముఖ్యమంత్రితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఒకసారి, వారంలో మరోసారి మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని కలెక్టర్లకు నిర్దేశించారు.  
 
సమస్యల తక్షణ పరిష్కారానికి మరిన్ని నిధులిస్తాం 
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన సమస్యల తక్షణ పరిష్కారానికి ఇప్పటికే జిల్లాకు రూ.కోటి కేటాయించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ నిధుల్ని సమర్థంగా ఖర్చుచేస్తే.. అవసరమైతే మళ్లీ నిధులు సమకూరుస్తామని సీఎం చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనలో అక్కడికక్కడే పరిష్కరించగలిగిన సమస్యలకు నిధుల అడ్డంకి ఉండకూడదనే ఉద్దేశంతో రూ. కోటి నిధులను ఇప్పటికే కలెక్టర్లకు అందుబాటులో ఉంచారు.   

మరిన్ని వార్తలు