అందరికీ అందాలి: సీఎం జగన్‌

10 Sep, 2019 04:47 IST|Sakshi
సోమవారం మహిళా శిశు సంక్షేమంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

విధానం ఏదైనా ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులకు పూర్తిగా చేరాలి

సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ మార్గ నిర్దేశం

మహిళా శిశు సంక్షేమంపై ఉన్నత స్థాయి సమీక్ష

లబ్ధిదారునికి పథకం అందిందనే ఆధారం కోసమే బయోమెట్రిక్, ఆధార్, ఐరిస్‌ 

ప్రతి గ్రామ సచివాలయంలో హెల్ప్‌లైన్‌

స్కూళ్లలో చేరని విద్యార్థులపై దృష్టి పెట్టి.. బడికి పంపించాలి

వేధింపులకు గురైన మహిళలకు పరిహారం బకాయిలు చెల్లించండి

తక్షణం రూ.7.48 కోట్లు ఇవ్వండి

ఇలాంటి వాటి కోసం జిల్లా కలెక్టర్ల దగ్గర రూ.కోటితో నిధి 

మహిళల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం అందించాలి

స్కూళ్ల తరహాలోనే అంగన్‌ వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు

వాటికి నిధులిచ్చే దాతలు,సంస్థల పేర్లు పెడతాం

గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై నివేదికకు ఆదేశం

సాక్షి, అమరావతి: ఏ విధానమైనా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరడానికే తప్ప నిరాకరించడానికి కాదని, ఈ విషయంలో అధికారులందరూ స్పష్టతతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సంతృప్తికర స్థాయిలో (శాచ్యురేషన్‌) అందించడానికే ఈ విధానాలున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బయోమెట్రిక్‌/ ఐరిస్‌/ వీడియో స్క్రీనింగ్‌ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరిందనే ఆధారం కోసం తప్ప, నిరాకరించడానికి కాదని స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమంపై సోమవారం ఆ శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సంక్షేమ పథకాల అమలుపై మార్గ నిర్దేశం చేశారు. 

అత్యవసర విషయాలకు ప్రత్యేక మెకానిజం
గ్రామ సచివాలయాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయంలో ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా సంక్షేమం విషయంలో గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పారు. 1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.7.48 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం అక్కడికక్కడే స్పందిస్తూ తక్షణం నిధులు విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో వివిధ ఘటనల్లో బాధితులకు సహాయం చేయడానికి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలని సూచించారు. నిధి ఖర్చు అవుతున్న కొద్దీ.. కోటి రూపాయలకు తగ్గకుండా నిల్వ ఉండేలా వారం రోజుల్లో మళ్లీ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఒక విధానం తీసుకురావాలని అధికారులకు సూచించారు. బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించాలని, వాటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

స్కూళ్లలో చేరని విద్యార్థులను గుర్తించండి
అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలను గుర్తించడంతో పాటు వారిని వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. దాదాపు ఏడు వేల మంది అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరలేదని గుర్తించినట్లు ఈ సందర్బంగా  అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలకు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి తర్వాత వారి సామర్థ్యాలను బట్టి ఆయా తరగతుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మిగతా పిల్లలతో సమానంగా రాణించేలా వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీలపై ప్రత్యేక యాప్‌ రూపొందించాలని, పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం పేర్కొన్నారు. అంగన్‌వాడీ వర్కర్లను ఆ దిశగా సమాయత్తం చేయాలని సూచించారు. 

మహిళా శిశు సంక్షేమంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సీఎస్సార్‌ భాగస్వామ్యంపై దృష్టి సారించాలి
అంగన్‌వాడీ కేంద్రాల స్థితిగతులపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు తరహాలో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా చేపట్టడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. మూడేళ్లలో ఈ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ రూపకల్పనకు ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని, ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కార్పొరేట్, వివిధ ప్రైవేట్‌ సంస్థలకు పూర్తి సమాచారం ఇవ్వాలని, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద వారి భాగస్వామ్యానికి అవకాశాలు కల్పించాలన్నారు. ఇదిలా ఉండగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై ఇప్పుడున్న పరిస్థితి ఏమిటో తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి కోరారు. భూ వివాదాలు, ఇతరత్రా వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని, వీటిని దశాబ్దాల తరబడి నాన్చుతూ న్యాయం జరగని పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. గ్రామ న్యాయాలయాలపై తనకు పూర్తి వివరాలు అందజేయాలన్నారు.

మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
మహిళల్లో రక్తహీనత సమస్యపై ముఖ్యమంత్రి స్పందిస్తూ మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, రక్త హీనత రాకుండా చర్యలను చేపట్టాలని సూచించారు. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించడంతో పాటు, రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. టెస్ట్‌ – ట్రీట్‌ – ట్రాక్‌ విధానంలో రక్తహీనతను అధిగమించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గర్భవతులకు ఎలాంటి ఆహారం ఇస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. దీనిపై అధికారులు వివరిస్తూ ఒక్కొక్కరిపై రోజుకు రూ.22.50 ఖర్చు చేస్తున్నామన్నారు. ఏయే సరుకులకు ఎంత ఖర్చు చేస్తున్నారని విడిగా వివరాలు రూపొందించాలని, మరింత నాణ్యతగా పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇందుకు ఎలాంటి పద్ధతులు, విధానాలు రూపొందించాలో ఆలోచించి నివేదిక ఇవ్వాలన్నారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామ వలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వయసుకు తగ్గ బరువులేని వాళ్లు 17.2 శాతం, వయసుకు తగ్గ ఎత్తు లేనివాళ్లు 30.2 శాతం ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఇచ్చే ఆరోగ్య కార్డులను దీనికోసం వాడుకోవాలని, అందులో ఈ వివరాలు నమోదు చేయాలన్నారు. దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని చెప్పారు. వారికి ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యానికి బానిసలైన వారి కోసం కౌన్సెలింగ్‌ కేంద్రాల ఏర్పాటు అంశంపై దృష్టి పెట్టాలని, దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేసి తనకు అందజేయాలన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా