అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

6 Jul, 2019 11:08 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అగ్రికల్చర్‌ మిషన్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, పెట్టుబడి సాయం, పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ తదితర అంశాలపై చర్చించేందుకు ఆయన ఇవాళ ఉదయం తాడేపల్లిలోన తన క్యాంపు కార్యాలయంలో వ‍్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు అధికారులుతో సమావేశం అయ్యారు. కాగా వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలు కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విధాన సలహా మండలిగా అగ్రికల్చర్‌ (వ్యవసాయ) మిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

వ్యవసాయం, అనుబంధ రంగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉత్తమ సమన్వయానికి ఈ మిషన్‌ దోహదపడుతుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఎప్పటి కప్పుడు ఉత్తమమైన సేవలు అందించడం, ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ధరలు సహా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తుంది. అలాగే వ్యవసాయ సంస్థలకు, రైతాంగానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకత్వం వహిస్తుంది. రైతులు సాధికారిత సాధించేలా విధానపరమైన ప్రాథమిక వేదికగా ఉంటుంది. ఈ మిషన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌గా, రైతు నాయకుడు ఎంవీ ఎస్‌ నాగిరెడ్డి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు