బాలుడికి ముఖ్యమంత్రి ఆపన్నహస్తం

12 Nov, 2019 04:29 IST|Sakshi

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా చిన్నారి ‘శశిధర్‌’కుటుంబానికి ఆర్థిక సాయం

అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు శశిధర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన ఎం.శశిధర్‌(4)కు కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్‌లో చేర్పించగా అది డెంగీ అని, మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్‌ చేయించాలన్నారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులు చేసుకునే బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకునేందుకు డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు.

ఈ విషయంపై సోమవారం పలు పత్రికల్లో కథనాలు రావడంతో వీటిని చదివిన ముఖ్యమంత్రి స్పందించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా వెంటనే బాలుడికి సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి అధికారులు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి శశిధర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సాయం అందిస్తామని, వైద్యానికి సంబంధించిన అన్ని కాగితాలను తీసుకొని రావాలని సూచించారు. తమ బాలుడి పరిస్థితిని తెలుసుకొని ముఖ్యమంత్రి నేరుగా స్పందించడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులంతా హర్షం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు