బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు.. నెలాఖరుకు భర్తీ

21 Jul, 2020 04:27 IST|Sakshi

అందరికీ పథకాలు అందేలా కార్పొరేషన్లు చూడాలి

ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల లబ్ధి

నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ.. బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్‌గా ఎవరూ, ఎప్పుడూ పనిచేయలేదు

వైఎస్సార్‌ చేయూత ద్వారా బీసీ మహిళలకు సింహభాగం లబ్ధి.. కొత్తవాటితో కలుపుకుని బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్ల ఏర్పాటు

గతంలో 69 కులాలకే ప్రాధాన్యత.. ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ పెద్దపీట

బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 52 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఆయా బోర్డు డైరెక్టర్ల నియామకాన్ని ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి కార్పొరేషన్‌లో 7–12 మంది డైరెక్టర్లు ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ఆయా వర్గాలకు అందుతున్నాయా? లేదా? అనే విషయంతో పాటు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై సోమవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని కార్పొరేషన్లకు ఒకే భవనం నిర్మించాలని ఆదేశించారు. ఆయా వర్గాల వారికి ఆయా కార్పొరేషన్లు మార్గదర్శకంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

► ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ తీసుకువస్తున్నాం.
► 18 నెలల్లోగా ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను తీసుకురావడానికి కార్యాచరణ చేపడుతున్నాం.
► వారి స్కిల్స్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
► జర్మనీ లాంటి దేశాలకు చెందిన అనేక పెద్దపెద్ద సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
► కార్పొరేషన్ల కింద ఉన్న వివిధ వర్గాల వారికి ఈ ప్రయోజనాలు అందేలా చూడాలి.
► అందరికీ నైపుణ్యాభివృద్ధి అందేలా చూడాలి.
► ప్రతి కార్పొరేషన్‌లోనూ ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రతినిధి ఉండాలి.

బీసీలకు ఎవరూ చేయనంతగా లబ్ధి
► రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు ఇప్పటివరకు ఎవరూ చేయనంతగా లబ్ధి చేకూర్చాం.
► రూపాయి లంచం తీసుకోకుండా.. వివక్ష చూపకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నాం.
► నేరుగా నగదు బదిలీ కింద ప్రయోజనం అందించాం.
► ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్లను వివిధ పథకాల కింద నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించాం.
► ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్‌గా ఎప్పుడూ ఎవరూ పనిచేయలేదు.
► 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూతను అమలుచేస్తున్నాం.
► ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది మహిళలు ఆ పథకంలో లబ్ధి పొందుతారు.
► అందులో సింహభాగం లబ్ధి బీసీ మహిళలకు జరుగుతుంది.
► చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వారికి మేలు చేస్తున్నాం.
► సంచార జాతుల సమస్యలను వెంటనే కమిషన్‌ దృష్టికి పంపించాలి.

గతంలో ఎన్నికలకు ముందు మొక్కుబడిగా చర్యలు
ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నికలకు ముందు హడావుడిగా 13 కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తూ కంటితుడుపు చర్యలు తీసుకున్న విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. వాటిలో కూడా చాలావరకు ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చారని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. కానీ, ఇప్పుడేమో జనాభా, వారి స్థితిగతులను ప్రాతిపదికగా తీసుకుని ఈ కార్పొరేషన్లు ఏర్పాటుచేసినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారులు వివరించారు. చర్చకు వచ్చిన ఇతర అంశాలు..
► కనీసం 30–35 వేల జనాభా ఉన్న కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు.
► ప్రతీ కులానికీ ఏదో ఒక కార్పొరేషన్‌లో చోటు. 
► పది లక్షలకు పైబడి జనాభా ఉన్న కార్పొరేషన్లు 6, లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు 27, లక్ష లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు 19 ఏర్పాటు.
► లోతుగా అధ్యయనం చేసి మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడానికి నిర్ణయం.
► కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలే పరిగణలోకి తీసుకోగా, ఇప్పుడు మొత్తం 139 కులాలు ఆయా కార్పొరేషన్లలో చేరాయి.

ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వేణుగోపాలకృష్ణ, పొన్నాడ సతీష్, విడదల రజని, జోగి రమేష్, పి.ఉమాశంకర్‌ గణేష్, అదీప్‌ రాజు, బుర్రా మధుసూదన్‌ యాదవ్, గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు