ప్రతి తలుపూ తట్టండి: సీఎం జగన్‌

9 Apr, 2020 03:26 IST|Sakshi
ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మూడోసారి సర్వేలో 1.42 కోట్ల

కుటుంబాల ఆరోగ్య పరిస్థితి పరిశీలించాలి

కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

కోవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్‌లలో అదనంగా మందులు తెప్పించుకోవాలి

అర్హులందరికీ రేషన్, రూ.1,000 సాయం అందాల్సిందే   

1902 నంబర్‌కు మరింత ప్రచారం ఇవ్వాలి

ఇంటింటి సర్వే ద్వారా రాష్ట్రంలో మొత్తం 1,42,13,460 కుటుంబాల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి. ఇప్పటికే చేసిన సర్వేల ప్రకారం జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించిన 11,821 మందిపై దృష్టి పెట్టాలి. వీరిలో వైద్యుల సూచన మేరకు 2,045 మందికి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయించాలి.

పంటను అమ్ముకోవడంలో ఇబ్బందులు ఉంటే రైతులు 1902కు కాల్‌ చేయాలి. ఈ దిశగా అధికారులు మరింత ప్రచారం చేయాలి. ఈ నంబర్‌కు రైతుల నుంచి కాల్‌ రాగానే వేగంగా స్పందించి చర్యలు తీసుకోవాలి. 

వ్యవసాయ పనులకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలి. క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించుకునేందుకు రూపొందించిన యాప్‌పై విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు అవగాహన కల్పించాలి.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడోసారి ప్రారంభమైన ఇంటింటి సర్వే ద్వారా కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి, తగిన వైద్య సహాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వైద్యులు సూచించిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం.. లక్షణాలున్న వారిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ సర్వేను నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ, కోవిడ్‌ ఆసుపత్రుల సన్నద్ధత, పేదలకు ఆర్థిక సహాయం, ఉచిత బియ్యం పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు లభిస్తున్న ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన వివరాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

కోవిడ్‌ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు
► కోవిడ్‌ ఆసుపత్రుల్లో లక్ష్యాలకు అనుగుణంగా బెడ్లు ఏర్పాటు చేయాలి. 13 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో 8,950 బెడ్లకుగానూ 6,662 బెడ్లు.. 650 ఐసీయూ బెడ్లకు గానూ 334 సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి కూడా అతి త్వరలో ఏర్పాటు కావాలి. 
► క్వారంటైన్లలో ముందు జాగ్రత్తగా మందులు అదనంగా అందుబాటులో ఉంచాలి. స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ప్రకారం ఎక్కడా కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. 
► ఏప్రిల్‌ 7వ తేదీ ఉదయం నుంచి ఏప్రిల్‌ 8 వరకు మొత్తం 690 పరీక్షలు చేయగా, 25 పాజిటివ్‌గా వచ్చాయి.  ఇవన్నీ దాదాపు ఢిల్లీ వెళ్లిన వారి కాంటాక్ట్‌ కేసులే. 
► జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో బాధ పడుతున్న వారిలో హోం క్వారంటైన్‌లో ఉన్న 1,750 (బుధవారం సాయంత్రానికి 1752) మందిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలి. 

అర్హులందరికీ సాయం అందాలి
► అర్హత ఉన్న వారికి రేషన్, రూ.1000 సహాయం కచ్చితంగా అందాలి. 1902కు వచ్చిన ప్రతికాల్‌ను ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కరించాలి. 
► ఇప్పటి వరకు 1.36 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రేషన్, 1.22 కోట్ల కుటుంబాలకు రూ.1,000 పంపిణీ చేశామని, మిగిలిన కటుంబాలకు పంపిణీ కొనసాగిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 
► ప్రతిరోజూ అనంతపురం, కడప, ఇతర ప్రాంతాల నుంచి సుమారు 350 ట్రక్కుల వరకు అరటిని ఎగుమతి చేస్తున్నామని, ఇది కాక అదనంగా కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లకు తరలిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సుమారు 2 వేల మెట్రిక్‌ టన్నుల అరటిని ఎగుమతి చేశామని తెలిపారు.
► సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు