చెరకు రైతుల బకాయిలు తీర్చాలి

4 Jul, 2020 04:01 IST|Sakshi

రూ.54.6 కోట్లు 8న చెల్లించేలా చర్యలు తీసుకోవాలి

సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

బకాయిల చెల్లింపుతో 15 వేల మంది రైతులకు ప్రయోజనం 

మంత్రుల బృందం ద్వారా సహకార చక్కెర ఫ్యాక్టరీలపై 

మరింతగా అధ్యయనం ∙ఆగస్టు 15లోగా నివేదిక ఇవ్వాలి

సాక్షి, అమరావతి: చెరకు రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.54.6 కోట్ల బకాయిలను ఈ నెల 8న రైతు దినోత్సవం సందర్భంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీని వల్ల దాదాపు 15 వేల మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై మరింతగా అధ్యయనానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నామని, ఈ బృందం లోతుగా అధ్యయనం చేసి ఆగస్టు 15వ తేదీలోగా సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. ఈ సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. 

► రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలపై సీఎం ఆరా తీశారు. 
► ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వ పరంగా ఎంత వరకు వినియోగించగలమో ఆలోచించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీతో పాటు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీలు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకునేలా ఆలోచించాలన్నారు. దీని వల్ల ఆ ఫ్యాక్టరీలకు కొంతైనా మేలు జరుగుతుంది.
► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు