అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

14 Oct, 2019 13:35 IST|Sakshi

సాక్షి, అమరావతి : అగ్రికల్చర్‌ మిషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకంపై, ధరల స్థిరీకరణ నిధి, రబీ సాగు కార్యాచరణపై రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని రైతు సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఖరీఫ్‌ స్థాయిలో సాగు లేదని చెప్పారు.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఇచ్చే సొమ్మును రెండు, మూడు విడతలుగా ఇచ్చిననా  అభ్యంతరం లేదన్నారు. సంక్రాంతి సమయంలో ఎంతో కొంత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఇచ్చే రూ.12,500లు ఒకే సారి ఇచ్చే బదులు మే నెలలో ఒకసారి, పంటకోసే సమయంలో, రబీ అవసరాల కోసం ఎంతో కొంత పెంచి మొత్తాన్ని సంక్రాంతి కానుకగా రైతులకు ఇవ్వాలని కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్, ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పాలగుమ్మి సాయినాథ్, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్‌ జగన్ తెలిపారు. రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 67,500 పెట్టుబడి సాయం రైతులకు అందనుంది.

రేపే రైతు భరోసా.. రూ. 5,510 కోట్లు విడుదల
రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. రైతులకు రైతుభరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు