అప్పుడే ‘స్పందన’కు అర్థం ఉంటుంది : సీఎం జగన్‌

17 Sep, 2019 16:13 IST|Sakshi

‘స్పందన’పై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

 

సాక్షి, అమరావతి : స్పందన కార్యక్రమం ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం అధికారులు వర్క్‌షాపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు వర్క్‌ షాపులు నిర్వహించాలన్నారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంపై అలసత్వం చూపొద్దని జగన్ స్పష్టం చేశారు. సమస్యలు తీరుస్తారన్న ఆశతో ప్రజలు అధికారుల దగ్గరకు వస్తారని, వారి స్థానంలో ఉండి ఆలోచించి అధికారలు స్పందించాలని సూచించారు. అప్పుడే స్పందనకు అర్థ ఉంటున్నారు. ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు మరింత మానవీయ దృక్పథంతో వినతులకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుంది
రాష్ట్రస్థాయిలో చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ నెల(సెప్టెంబర్‌)24,27 తేదీలలో వర్క్‌షాపు నిర్వహించాలని సీఎం జగన్‌ సూచించారు. అక్టోబర్‌లో జిల్లా స్థాయిలో వర్క్‌షాపులు నిర్వహించాలని ఆదేశించారు. దిగువ స్థాయి అధికారులకు మరింత మోటివేషన్‌ పెంచడమే దీని ఉద్దేశమన్నారు. కలెక్టర్లు కూడా ఈ వర్క్‌ షాపులో పాల్గొనాలన్నారు. నవంబర్‌ నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు. 

అక్టోబరు 2 నుంచి గ్రామ సెక్రటేరియట్లు
గ్రామ సెక్రటేరియట్లను అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.‘కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు నుంచి ఇవ్వాలి. అక్టోబరు, నవంబరు నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తిచేయాలి. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ అందుబాటులోకి రాగానే అక్కడే డిస్‌ప్లే ఉండాలి. రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితాను బోర్డులో పెట్టాలి.ఇళ్లపట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా పెట్టే ప్రయత్నం చేయాలి. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పెట్టాలి. ఈ జాబితామీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, పథకం ఎవ్వరికీ అందకపోయినా ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలి. వారికి అందించాల్సిన ధర్మం, బాధ్యత మనదే’  అని సీఎం జగన్‌ అధికారులతో పేర్కొన్నారు.

ఇళ్లస్థలాలు పంపిణీపై సమీక్ష
ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాలను పంపిణీ చేయాలని, దీని కోసం లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్‌ వేగవంతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి డేటా కలెక్షన్‌, వెరిఫికేషన్‌ పూర్తికావాలన్నారు. అక్టోబర్‌ చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంతో తేల్చాలన్నారు. నవంబర్‌ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ చేపట్టాలన్నారు. 

5.3 కోట్ల మందికి కంటి పరీక్షలు
వైఎస్సార్‌ కంటి వెలుగు కింద 5.3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్‌ అన్నారు. ఆరు విడతలుగా ఈ కార్యక్రమం నిర్వహించాలని, 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటికి సంబంధింన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూ. 560కోట్లతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని సీఎం తెలిపారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స, ఇతర కార్యక్రమాలన్నీ వైయస్సార్‌ కంటి వెలుగు కింద  నిర్వహిస్తామన్నారు. పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రూ.43లు రోజులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు రోజుకు రూ.18 అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం జగన్‌ తెలిపారు. 

ఇసుక కొరతపై సమీక్ష
ఇసుక కొరతపై సీఎం జగన్‌ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదలు కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని అకారులు సీఎం జగన్‌కు వివరించారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా ప్రవాహాలు ఉన్నాయని, వరద తగ్గిన వెంటనే రీచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. వరద తగ్గగానే వీలైనంత ఇసుకను స్టాక్‌యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు