మానవత్వం అనేది ‍ప్రతీచర్యలో కనిపించాలి- సీఎం వైఎస్‌ జగన్

11 Sep, 2019 17:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందన కార్యక్రమం అమలు తీరుపై అధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో భాగంగా సమస్యలు పరిష్కరించామని చెప్తున్న వారిలో కొందరికి కాల్‌ చేసి అభిప్రాయాలు స్వీకరించాం. వీరిలో 59శాతం మంది తమ సమస్యలను బాగానే పరిష్కరించారని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 41 శాతం మంది ఆ సమస్యలను మరింత మెరుగ్గా పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. ‘జిల్లాలనుంచి కొంతమంది అధికారులను పిలిపించి వారు ఏ తరహా సమాధానాలు ఇచ్చారో వారికే చూపించి కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎమ్మార్వో, ఎంపీడీఓలతో  వర్క్‌షాప్‌ నిర్వహిస్తాం.

మానవత్వం అనేది ప్రతి చర్యలో, ప్రతి అక్షరంలో కనిపించాలి. లేకపోతే వ్యవస్థ ఎందుకు నడుస్తుందో.. అర్థం కాని పరిస్థితి వస్తుంది. వినతులు ఇవ్వడానికి వచ్చే ప్రజలపట్ల కొన్నిచోట్ల సిబ్బంది సవ్యంగా ప్రవర్తించడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి. ఇలాంటి కేసులు 2 నుంచి 5 శాతం వరకు ఉన్నాయి. వాళ్లు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చాం. మనం సేవకులమే కానీ, పాలకులం కాదు. ఈ విషయంపై కలెక్టర్లు అంతా ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడాలని కోరుతున్నా. పనిభారం వల్లో, మరే ఇతర కారణాలవల్లో ఇలాంటివి తలెత్తకుండా, గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని మరిచిపోవద్దని' స్పందన స్ఫూర్తి తగ్గకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన పరీక్షలను అద్భుతంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించినందుకు కలెక్టర్లను సీఎం ప్రశంసించారు. 


ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు

అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్‌ కంటి వెలుగుపైనా దృష్టి పెట్టాలి. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి. అక్టోబరు 2 న గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభిస్తున్నాం. డిసెంబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నాం. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమం వల్ల కలెక్టర్ల పేరు, అధికారుల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న సీఎం, కనీసం ప్రతి జిల్లాలో 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. లక్షలమంది జీవితాలను మార్చే అవకాశం అధికారులకు, నాకు వచ్చింది. దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1,45,72,861 కుటుంబాల్లో 1,21,62,651 ఇళ్లను వాలంటీర్లు వెరిఫికేషన్‌ పూర్తిచేశారని చెప్పిన అధికారులు ఈ వారానికి పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ పూర్తవుతుందన్న తెలిపారు.

సొంతంగా ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి సాయంగా అందించే రూ.10వేలు పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేపట్టండి. విశాఖ, విజయవాడల్లో ఆటోలు, ట్యాక్సీలు ఎక్కువ కాబట్టి.. అక్కడ ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. దరఖాస్తులు స్వీకరించేటప్పుడు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా వీలైనన్ని ఎక్కువ కౌంటర్లు పెట్టాలని ముఖ్యమంత్రి ఈ సం‍దర్భంగా అధికారులకు సూచించారు. దరఖాస్తులు ఆమోదం పొందగానే అక్టోబరు 4 నుంచి పంపిణీ ప్రారంభించాని, అక్టోబరు 5న రశీదులు లబ్ధిదారులకు అందించాలన్నారు.

అక్టోబరు 15 నుంచి రైతు భరోసాపై సీఎం సమీక్ష
వచ్చే నెల 15 నుంచి రైతు భరోసాపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అర్హత ఉన్నవారికి తప్పకుండా, పారదర్శకంగా ఈ పథకాలు చేరాలన్నారు. ఇసుక సమస్యపై కలెక్టర్లతో మాట్లాడిన సీఎం, వరదల కారణంగా రీచ్‌లు నిర్వహించలేని పరిస్థితి ఉందన్నారు. వరదలు తగ్గగానే వెంటనే రీచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని, స్టాక్‌యార్డుల్లో నిల్వలు పెంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇసుక మాఫియా, దోపిడీ లేకుండా వీలైనంత తక్కువ రేటుకు పారదర్శకంగా ఇసుక పంపిణీ చేస్తున్నామన్నారు. కృష్ణా వరదలపై , గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రూ.5వేల ప్రత్యేక సహాయంపై కలెక్టర్లను ఆరా తీశారు. ప్రతి కలెక్టరేట్‌లో ఎక్స్‌ సర్వీస్‌మెన్, దివ్యాంగులకో సం ప్రత్యేక సెల్స్‌ను ఏర్పాటు చేయాలని, వీలైతే ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులను ఆ సెల్‌లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. 

>
మరిన్ని వార్తలు