విజయవాడలో వైఎస్సార్‌ విగ్రహం పున:ప్రతిష్ట

2 Sep, 2019 18:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. సోమవారం వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో నాటి టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలోని మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదే ప్రాంతంలో మహానేత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసింది. అలాగే కంట్రోల్‌ రూమ్‌ సమీపంలోని ప్రగతి పార్క్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ పార్క్‌గా నామకరణం చేశారు. మహానేత విగ్రహం ఏర్పాటుతో నాలుగేళ్ల తర్వాత కంట్రోల్‌ రూమ్‌ సెంటర్‌లో మళ్లీ శోభ ఉట్టిపడుతుంది.

తమ అభిమాన నేత విగ్రహావిష్కరణను తిలకించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున డాక్టర్‌ వైఎస్సార్‌ పార్క్‌కు తరలివచ్చారు. దీంతో పోలీసులు ఆ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అలాగే బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. కాగా, 2011లో విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద పోలవరం ప్రాజెక్టు ప్రతిమపై వైఎస్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం రాజకీయ కారణాలతో టీడీపీ ప్రభుత్వం గత కృష్ణా పుష్కరాల సమయంలో 2016 జూలై 31వ తేదీ అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య ఆ విగ్రహాన్ని తొలగించింది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఆధ్వర్యంలో అన్ని అనుమతులతో విగ్రహ పునఃప్రతిష్ట జరిగింది. నేడు మహానేత వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు