అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా

9 Jan, 2020 04:05 IST|Sakshi

నేడు చిత్తూరులో ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ప్రజాసంకల్పయాత్ర పూర్తయ్యి నేటికి ఏడాది.. ఈరోజే అమ్మఒడికి శ్రీకారం

ఈ ఏడాది బడ్జెట్‌లో అమ్మఒడికి రూ. 6,456 కోట్లు కేటాయింపు

1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్తింపు

నేరుగా తల్లులు లేదా సంరక్షకుల ఖాతాలకు నగదు బదిలీ

అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు వర్తింపు

లబ్ధి చేకూరనున్న తల్లుల సంఖ్య 43 లక్షలు

లబ్ధి చేకూరనున్న విద్యార్థుల సంఖ్య 82 లక్షలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తానని హామీనిస్తూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యి నేటికి ఏడాది. ఆ ప్రజా సంకల్పయాత్రలో తల్లులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సరిగ్గా అదే రోజున.. నేడు అమ్మఒడి పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ‘జగనన్న అమ్మఒడి’ని గురువారం చిత్తూరు నగరంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, బడిబయట ఏ ఒక్క చిన్నారి ఉండకూడదనే గొప్ప లక్ష్యంతో.. పిలల్ని బడికి పంపే  ప్రతి పేదతల్లికి అమ్మఒడి పథకంలో ఏటా రూ.15 వేల చొప్పున చేయూతనందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ హమీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి కార్యరూపమిస్తూ.. పిల్లల్ని బడికి పంపే దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడిలో లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. 

ఎక్కడ చదివించినా పథకం వర్తింపు
అమ్మఒడి పథకంలో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్‌లో ఏడాదికి రూ.15 వేలు నేరుగా జమచేస్తారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. అనంతరం ఇంటర్‌ వరకు వర్తింపచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా ఫరవాలేదని.. పేద పిల్లల చదువుకు ఖర్చుచేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్న మాటల్ని చేతల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించారు. ‘జగనన్న అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చుచేస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.6,500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తింపచేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను ఎక్కడ చదివించినా ఆ తల్లికి సాయం అందేలా పథకం అమలు చేస్తున్నారు.  

జాబితాలో పేరు లేకపోయినా.. అర్హులైతే లబ్ధి
జాబితాలో తల్లులు/సంరక్షకుల పేర్లు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామ/వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల దృష్టికి  తీసుకెళ్తే వాటిని పరిశీలించి పరిష్కరిస్తారు. ఎవరైనా సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందచేయకపోతే.. వారు ఆ పత్రాల్ని గ్రామ/వార్డు సచివాలయాలు, మండల విద్యాధికారుల దృష్టికి తీసుకెళితే.. వాటిని పరిశీలించి అర్హులైతే లబ్ధిదారులుగా గుర్తిస్తామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. 

నెరవేరుతున్న అమ్మఒడి ప్రయోజనం
ప్రతి ఏడాది జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదును జమచేస్తారు. ఈ పథకం అమలుతో బడి బయట పిల్లల సంఖ్య భారీగా తగ్గింది. ఆర్థిక సమస్యలతో పిల్లలు మధ్యలోనే చదువు మానేయకుండా ఈ పథకం ఉపయోగపడనుంది. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించగలుగుతాయి.

ప్రతి స్కూల్లో నేడు ప్రారంభోత్సవ కార్యక్రమాలు
గురువారం ఉదయం 11.15 గంటలకు చిత్తూరులోని పీవీకేఎస్‌ గవర్నమెంట్‌ కాలేజీ గ్రౌండ్స్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి సీఎం చేరుకుని విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. అనంతరం స్థానికంగా అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.45 గంటలకు అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపింది. గురువారం అర్హులైన తల్లులు/సంరక్షకులతో పాటు.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి. సీఎం ప్రారంభించే అమ్మఒడి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి.

మాలాంటి వారికి అభయం.. అమ్మఒడి
వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): ఈ ఫోటోలోని మహిళ పేరు వెంకటమ్మ. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కోవూరుపాడు స్వగ్రామం.. ఐదేళ్ల క్రితం భర్త మరణించడంతో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేంది. విధివశాత్తూ 7 నెలల క్రితం కూలికి వెళ్లొస్తూ ప్రమాదానికి గురైంది. కాలు విరగడంతో ఇప్పటికీ నడవలేని పరిస్థితి. ఆమె ఇద్దరు కుమారుల్లో సురేష్‌ 5 వ తరగతి, భాస్కర్‌ 4వ తరగతి చదివేవాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారు బడి మానేసి పనిలో చేరదామనుకుంటున్న తరుణంలో అమ్మఒడి పథకం అభయంగా మారింది. అమ్మఒడి పుణ్యాన వారిద్దరూ ఇప్పుడు స్కూలుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమలాంటి నిరుపేద కుటుంబాల పిల్లల చదువుకు భరోసా అని వెంకటమ్మ ఆనందంతో చెబుతోంది.

ఆసరా దొరికింది  
ముమ్మిడివరం: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన వక్కలంక బుల్లియ్య, మేరీలు దంపతులు.. మేరీ క్యాన్సర్‌తో మరణించగా.. బుల్లియ్య అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వారిద్దరి పిల్లలు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. ఒకరు స్థానికంగా చదువుతుండగా.. మరొకరు రాజమహేంద్రవరంలోని ఒక స్వచ్ఛంద సంస్థ హాస్టల్‌లో చదువుతున్నాడు. ఇప్పడు అమ్మఒడి పథకం ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అమ్మఒడి పథకంలో రూ.15వేలు ఆర్థికసాయం రానుండడంతో.. ఇద్దరు పిల్లలను బాగా చదివించేందుకు ఆసరా దొరికిందని అమ్మమ్మ వంగా రాజేశ్వరి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆ ఇద్దరు పిల్లలు చదువుకు దూరమవుతారని భయపడ్డానని.. అమ్మఒడి పథకం ఆసరాగా నిలిచిందని ఆమె అంటోంది. 

మరిన్ని వార్తలు