15 మద్యం, మాదకద్రవ్య విమోచనా కేంద్రాలు ప్రారంభం

30 May, 2020 05:02 IST|Sakshi
విమోచనా కేంద్రాలను డిజిటల్‌ విధానంలో ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఒక్కో కేంద్రంలో 15 పడకలు, ఉచితంగా వైద్యం 

సంవత్సరాంతానికి మరో పది కేంద్రాలు

సాక్షి, అమరావతి:  మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిని తిరిగి సమాజ జీవనంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ‘మన పాలన, మీ సూచన’ కార్యక్రమం సందర్భంగా డిజిటల్‌ విధానంలో 15 కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆ విమోచనా కేంద్రాల వివరాలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా వెల్లడించారు.  

► మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో విభిన్న ప్రతిభావంతులు, లింగమార్పిడి, వయోవృద్ధుల విభాగం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.  
► 15 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి నిర్వహణకు ఏటా రూ. 4.98 కోట్లు వ్యయం అవుతుంది. 
► ఈ కేంద్రాల్లో ఇన్‌పేషెంట్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అన్ని కేంద్రాల్లో ఓ మానసిక వైద్య చికిత్స నిపుణుడు, ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వైద్యుడు, ముగ్గురు కౌన్సిలర్లతో సహా 11 మంది సిబ్బంది ఉంటారు. 
► డాక్టర్, కౌన్సిలర్లు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందిస్తారు. 
► ప్రతి కేంద్రం 15 పడకల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉచితంగా వైద్యం అందిస్తారు.  ఈ ఏడాది చివరి నాటికి, ప్రభుత్వ ఆస్పత్రులలో మరో 10 విమోచనా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.  
► ఎన్‌డీడీటీసీ, ఎయిమ్స్, భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో 10 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వారిలో 13.7% ప్రస్తుతం మద్యం వినియోగిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయటమే ప్రభుత్వ ధ్యేయం  
► ఏపీలో మద్యం కారణంగా 47 లక్షల మంది, ఓపియాయిడ్‌ బాధితులు 3.6 లక్షల మందికి సహాయం అవసరం.  
► గంజాయి వాడకం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న సుమారు 1.08 లక్షల మంది, ఇతర మత్తు మందుల బాధితులు 1.4 లక్షల మంది ఏపీలో సహాయం కోసం వేచి ఉన్నారు. 

>
మరిన్ని వార్తలు