రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్‌

6 Feb, 2020 16:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు బుకింగ్‌ చేసుకునే వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గురువారం అమరావతిలో అగ్రి మిషన్‌, కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి సీఎం జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కొడాలి నాని, సీఎస్‌ తదితరులు పాల్గొన్నారు. ('భవిష్యత్తులో భరోసా కేంద్రాలు సేకరణ కేంద్రాలు కావాలి')

కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూడాలి
అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టిక ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రకటించిన ధరలకన్నా తక్కువకు కొనుగోలు చేస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఎక్కడ రైతు నష్టపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. దీనికోసం సరైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులనుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా సిబ్బందిని ఉంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం శనగలు, కందులు మార్కెట్లోకి వస్తున్నాయన్నారు. పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరల రేట్లను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని, అలాగే కొనుగోలు కేంద్రాల వివరాలు కూడా గ్రామ సచివాలయాల్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో పంటను కొన్న తర్వాత రైతులకు డబ్బులు వెంటనే అందేలా చూడాలని సూచించారు. రైతుకు కచ్చితంగా కనీస మద్దతు ధరలు రావాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ( ఎన్‌ రామ్‌తో సీఎం జగన్‌ మాటామంతి)

రైతుల్లో చైతన్యం తీసుకు రావాలి
వారానికోసారి కచ్చితంగా సమావేశం పెట్టుకుని రైతులకు అందుతున్న ధరలపై సమీక్ష చేయాలని, నాలుగు వారాలకోసారి తనతో సమావేశం కావాలని ముఖ్యమంత్రిసూచించారు. ఇది ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి అలసత్వం జరిగితే రైతుకు తీవ్ర నష్టం కలుగుతుందని, రైతుల్లో చైతన్యం తీసుకు రావాలని తెలిపారు. వచ్చే నెలకల్లా పరిస్థితిలో మొత్తం మార్పులు రావాలని, లేదంటే సంబంధిత అధికారులను కచ్చితంగా బాధ్యుల్ని చేస్తానని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పంటను అమ్ముకునే సమయంలో రైతులకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదని స్పష్టం చేశారు. ఈ కీలక అంశాలను అధికారులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలని, ఈ క్రమంలో ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదని తెలిపారు. అదే విధంగా శ్రీకాకుళంలో గోడౌన్ల సమస్యను మిషన్‌ సభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ విషయంపై  అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. కొత్త గోదాముల నిర్మాణం జరిగేంత వరకూ ప్రత్యామ్నాయాలు చూడాలన్నారు. (రాయిటర్స్‌ కథనాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం)


గోదాముల, కోల్డ్‌ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టండి
‘‘‘వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాలను ఓన్‌ చేసుకోవాలి. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలి. పశుసంవర్థకం, హార్టికల్చర్, ఫిషరీస్‌ రంగాలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొత్త ఊపు ఇవ్వాలి. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలి. రైతులు నాణ్యమైన విత్తనాలను కోరుకుంటున్నారు. వాటిని అందించడానికి దృష్టిపెట్టాలి విత్తన కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా చూడాలి. నకిలీ విత్తనాల కేసులను సీరియస్‌గా తీసుకోవాలి. పశువులకు వైద్యం అందిస్తున్న విధానాలపై దృష్టి పెట్టాలి. మందులు వాడకుండా పాలు ఉత్పత్తిచేసే వారిని పోత్సహించాలి. అలాంటి పాలకు గిట్టు బాటు ధరలు మరింత పెంచాలి. ఆర్గానిక్‌ మిల్క్‌ పేరిట ఈ పాలను అమ్మేందుకు చర్యలు తీసుకోవాలి. అన్ని పశువులకూ ట్యాగ్‌ వేయాలి’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అదికారులను ఆదేశించారు.

ఎరువులు, విత్తనాల కంపెనీలను నుంచి మంచి సానుకూల స్పందన ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.  ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఈకంపెనీలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయని, ఆమేరకు ధరలు తగ్గించి ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు కచ్చితంగా వినూత్న విధానాలకు దారితీస్తాయన్నారు. వ్యవసాయ శాఖలోనే లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎంకు వెల్లడించారు. యూనివర్శిటీ సిఫార్సులు ప్రకారం బెంగాల్‌ గ్రామ్‌ విత్తనాలను పూర్తిస్థాయిలో సప్లై చేస్తున్నామని అధికారులు అన్నారు.

మరిన్ని వార్తలు