గోదావరి జలాల మళ్లింపునకు సాయం చేయండి

15 Aug, 2019 04:48 IST|Sakshi
కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను అందిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంతో శ్రీశైలం, సాగర్‌లలోకి జలాలు

రోజుకు 4 టీఎంసీల చొప్పున 4 నెలల్లో 480 టీఎంసీల తరలింపు

తద్వారా కరువు ప్రభావిత, వెనుకబడిన జిల్లాలకు మేలు

కేంద్ర జల శక్తి మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ

కేంద్ర మంత్రికి లేఖ అందజేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ‘శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాల మళ్లింపు పథకం’ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు లేఖ రాశారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ప్రయోజనం పొందుతాయని, ఏపీలోని కరువు ప్రభావిత, వెనకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ లేఖను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రిని కలసి అందజేశారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ఆయనకు వివరించారు. లేఖ సారాంశం ఇదీ..

‘ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు నిత్యం కరువు తాండవించే జిల్లాలు. గడిచిన పదేళ్లలో 2009–10 నుంచి 2018–19 వరకు ఏడేళ్లపాటు సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కాగా.. కేవలం మూడేళ్లు సాధారణ వర్షపాతం కంటే స్వల్పంగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. అనంతపురం జిల్లాను వర్షపాతంలో, కరువులో జైసల్మేర్‌ జిల్లాతో పోల్చుతారు. ఈ ఆరు జిల్లాల్లో సాగు యోగ్యత గల ప్రాంతం 98.89 లక్షల ఎకరాలుగా ఉంది. 39.77 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. కృష్ణా, తుంగభద్ర, పెన్నా, ఇతర చిన్న నదులు, వాగుల ఆధారంగా ఇక్కడ సాగవుతోంది. అయితే శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో ఏటా తగ్గుతూ వస్తోంది. గడిచిన ఐదేళ్లలో వచ్చిన ఇన్‌ఫ్లో 52 ఏళ్ల సగటుతో పోల్చితే 63 శాతం తక్కువ. పైన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు కట్టడం, ఎక్కువ నీటిని వినియోగించుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో గోదావరిలో భారీగా మిగులు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. దాదాపు 2,500 టీఎంసీలు కేవలం నాలుగు నెలల కాలం (జూలై నుంచి అక్టోబరు వరకు)లోనే సముద్రంలో కలుస్తున్నాయి.

గోదావరి–కృష్ణా నదులను అనుసంధానించడం ద్వారా ఈ నీటిని శ్రీశైలం, సాగర్‌ రిజర్వాయర్లలోకి మళ్లించాల్సిన అవసరం ఉంది. తద్వారా కరువు ప్రభావిత రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఈ దిశగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ ఏపీ, తెలంగాణ సీఎంలు, అధికారులతో కూడిన సమావేశం జూన్‌ 28న జరిగింది. గోదావరి జలాల మళ్లింపునకు విభిన్న ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు రెండు రాష్ట్రాల రిటైర్డ్‌ ఇంజినీర్లు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశాం. రోజుకు 4 టీఎంసీల నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలోకి గోదావరి వరద ఉన్న రోజుల్లో 120 రోజుల పాటు దాదాపు 480 టీఎంసీల మేర మళ్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా కరువు ప్రాంత, వెనకబడిన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు తీర్చడమే కాకుండా కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతున్నందున కేంద్రం ఈ పథకానికి తగిన సాయం చేయాలి’ అని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. 

మరిన్ని వార్తలు