ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు

28 Aug, 2019 03:49 IST|Sakshi
పౌరసరఫరాల శాఖ ద్వారా అందించనున్న బియ్యాన్ని పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి కొడాలి నాని

వినతి పత్రాలు ఇచ్చేందుకు ఎక్కువసేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకోండి

‘స్పందన’పై సమీక్షలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం 

ఇళ్ల స్థలాల కోసం ఎక్కువ వినతులు.. వాటిని ఇష్టానుసారం తిరస్కరించొద్దు

ఇంటి స్థలం కార్యక్రమంలో వలంటీర్ల పాత్ర చురుగ్గా ఉండేలా చర్యలు

గ్రామ సచివాలయాలతో కలెక్టర్ల అనుసంధానానికి యాప్‌ తయారీపై ఆరా

కలెక్టర్లు, ఎస్పీలు ప్రతి మంగళవారం కాఫీ టుగెదర్‌ కార్యక్రమంలో కలవాలి

సాక్షి, అమరావతి: ఇళ్ల స్థలాల కోసం ప్రజల నుంచి ఎక్కువ వినతులు వస్తున్నాయని, ఇందుకు సంబంధించి రసీదు ఇస్తున్న పద్ధతి మరింత మెరుగు పడాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇష్టానుసారం వినతులు తిరస్కరించొద్దన్నారు. ఇల్లు, స్థలం లేని ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి కచ్చితంగా ఇంటి స్థలం ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రొఫార్మా పంపుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలు కాఫీ టుగెదర్‌ కార్యక్రమంలో కలుసుకుని భూ వివాదాలపై చర్చించుకోవాలని చెప్పారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. గ్రామాల వారీగా వలంటీర్ల ద్వారా ఇళ్ల స్థలాల లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా కలెక్టర్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలన్నది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని, ఈ కార్యక్రమాన్ని సగర్వంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఇన్ని లక్షల మందికి ఇదివరకెన్నడూ రాష్ట్రంలో, దేశంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, గ్రామ వలంటీర్ల పాత్ర చురుగ్గా ఉండేలా చూసుకోవాలని, వలంటీర్లందరికీ త్వరగా స్మార్ట్‌ ఫోన్లు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ సచివాలయాలతో కలెక్టర్ల అనుసంధానానికి యాప్‌ తయారీపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 

వినతుల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం
ఇష్టానుసారం కారణాలు చూపి వినతులను తిరస్కరించకూడదని సీఎం చెప్పారు. పెండింగులో ఉన్న వినతులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పెండింగ్‌ వినతులు తగ్గాలంటే కలెక్టర్లు కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పెండింగ్‌ వినతులు ఎక్కువగా ఉన్న నెల్లూరు, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమని, మీరు ఏదైనా వినతిని తిరస్కరించే ముందు దానిపై సరైన కసరత్తు అవసరమని, తిరస్కరిస్తున్న వినతులు కలెక్టర్‌ పరిశీలనకు రావాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్పందన కింద వచ్చే వినతులకు రసీదులు ఇవ్వడంలో ఇబ్బందులు వస్తున్నాయని, క్యూలు భారీగా పెరుగుతున్నందున ప్రజలు చాలా సేపు వేచి ఉండాల్సి వస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అప్పటికప్పుడే చేతి రాతతో రసీదు ఇచ్చి, తర్వాత వాటిని కంప్యూటర్లలో అప్‌లోడ్‌ చేయించాలని, ప్రజల్ని ఎక్కువ సేపు క్యూలో ఉంచవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

కలెక్టర్లు, ఎస్పీలు భూ వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలి
కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్‌ కార్యక్రమం కింద ప్రతి మంగళవారం కలవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా భూవివాదాలకు సంబంధించిన జాబితాను ఇద్దరూ ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలని, గురువారం తహశీల్దార్, ఎస్‌ఐ, ఆర్‌ఐ, వీఆర్వోలు సమావేశమై భూ వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీల ప్రతిపాదనలు బాగున్నాయని పేర్కొన్న సీఎం మిగతా అధికారులూ పాటించాలని సూచించారు. చాలాచోట్ల భూ వివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారుతున్నాయన్నారు. ‘మళ్లీ చెబుతున్నా.. ఎక్కడా అవినీతి ఉండకూడదు. అవినీతి ఎక్కడున్నా ఉపేక్షించేది లేద’ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో నాణ్యమైన బియ్యం పంపిణీని మొదటగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తామని, ఇప్పటి వరకూ ఇచ్చిన బియ్యం నాణ్యత లేక ప్రజలు తినడం లేదన్నారు. చిత్రావతిడ్యామ్‌లో నీళ్లు నిలపడానికి రూ.52 కోట్లు కావాలని జిల్లా కలెక్టర్‌ అడగ్గానే వెంటనే ఇవ్వాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ సచివాలయాలపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ప్రింటర్, స్కానర్, నెట్, అన్నీ ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామ సచివాలయం పక్కనే నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కల్తీలేని వాటిని రైతులకు అందుబాటులో ఉంచగలిగితే రైతులకు మంచి చేసినట్లేనని సీఎం పేర్కొన్నారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల కోసం 22 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారనే నమ్మకంతో నేనున్నాను. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం, ఇన్ని లక్షల మంది పరీక్షలు రాయడం ఎప్పుడూ జరగలేదు. దీని ద్వారా మనం ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. నా కలెక్టర్లు, నా ఎస్పీలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నేను గర్వంతో చెబుతున్నా. ఎక్కడా విమర్శలు రాకుండా, పూర్తి పారదర్శక వి«ధానంలో పరీక్షలు నిర్వహించాలి’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు