హోదా సాధన దిశగా...

2 Jun, 2019 03:52 IST|Sakshi
తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆర్థిక, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

రాష్ట్రానికి హోదా ఆవశ్యకతను 15వ ఆర్థిక సంఘం ఎదుట సమర్థంగా చాటి చెప్పండి

ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

రాష్ట్ర ఆర్థిక సమస్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సిద్ధం చేయండి

మరో ఐదేళ్లపాటు రెవెన్యూ లోటు భర్తీ కోసం వినతి

రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యం

సామాన్యులపై భారం పడకుండా ఆదాయ మార్గాలపై అన్వేషణ

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ 

కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులనూ మళ్లించడంపై సీఎం విస్మయం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రతిపక్షంలో ఉండగా హోదా కోసం అన్ని వేదికలపైనా పోరాడిన వైఎస్సార్‌ సీపీ అధికారం చేపట్టాక తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తోంది. ఏపీకి సంజీవని లాంటి హోదా ఆవశక్యతను ప్రస్తావిస్తూ అధికారులను సైతం ఈ దిశగా కార్యోన్ముఖులను చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల ఎదుట సమర్థ వాదన వినిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమాయత్తం చేస్తున్నారు.
 
ఆర్థిక సమస్యలపై నివేదిక రూపొందించండి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ఎదుట ఆంధ్రప్రదేశ్‌ వాదనను సమర్థవంతంగా వినిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక రూపొందించి ప్రత్యేక హోదా ఎంత అత్యవసరమో కేంద్రానికి నివేదించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికీ రెవెన్యూ లోటులో కొనసాగుతున్న రాష్ట్రానికి మరో ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటు భర్తీ చేసేలా 15వ ఆర్థిక సంఘాన్ని కోరాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, ఆర్జన స్థితిగతులపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. 

సామాన్యులపై భారం లేకుండా ఆదాయ మార్గాలపై అన్వేషణ
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున ఆర్థిక క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, హంగు ఆర్భాటాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సామాన్యులపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడంపై ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కోరారు. హరిత పన్ను (గ్రీన్‌ టాక్స్‌), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరైన ఇసుక విధానం అమలు లాంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచడంపై కసరత్తు చేయాలని సూచించారు. పన్నేతర ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని నిర్దేశించారు. 

దారి మళ్లిన అప్పులు..
గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో పలు కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో విచ్చలవిడిగా అప్పులు తీసుకుని దారి మళ్లించిన వైనాన్ని చూసి ముఖ్యమంత్రి నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో అస్తవ్యస్థంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని అధికారులను సీఎం కోరారు.

అవినీతిపై ఉపేక్షించేది లేదు..
రెవెన్యూ శాఖలో ఎక్కడా అవినీతికి తావులేకుండా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అవినీతి రహిత పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం అంతా పనిచేయాలని, ఈ విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ఇది ప్రాథమిక సమీక్ష మాత్రమేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం తగిన చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు