గ్రాంట్లు ఇప్పించి ఆదుకోండి

19 Dec, 2019 03:47 IST|Sakshi

15వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం

నేడు ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భేటీ

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అత్యవసరాలను వివరించనున్న సీఎం

సాక్షి, అమరావతి: విభజన సమస్యలతోపాటు గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆర్థికంగా కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్రం నుంచి ఉదారంగా గ్రాంట్ల మంజూరుకు సిఫార్సు చేయాల్సిందిగా 15వ ఆర్థిక సంఘాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌తో పాటు మిగతా అధికారులు బుధవారం రేణిగుంట చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి ఆర్థిక మంత్రి బుగ్గన స్వాగతం పలికారు. అనంతరం వారు తిరుమలకు వెళ్లారు. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మధ్యాహ్నం విజయవాడ చేరుకోనున్నారు.

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వనున్న విందుకు ఎన్‌.కె.సింగ్‌తోపాటు అధికారులు హాజరు కానున్నారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో 15వ ఆర్థిక సంఘం సమావేశం కానుంది.  రాష్ట్రాన్ని గత సర్కారు ఆర్థికంగా దివాళా ఎలా దివాళా తీయించిందో వివరించడంతోపాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, అక్షరాస్యత పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, విద్య వైద్య రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మహిళలు, పిలల్లో పౌష్టికాహార లోపం నివారణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్‌ 15వ ఆర్థిక సంఘానికి తెలియచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆవశ్యకతలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని రాజ్యసభలో ఏపీకి ప్రకటించిన ‘ప్రత్యేక హోదా’ హామీ ఇప్పటికీ నెరవేరలేదని ఆర్థిక సంఘం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. 

హోదా ఎందుకంటే?
– హైదరాబాద్‌ కోల్పోయినందున ఆంధ్రప్రదేశ్‌ యువతకు ఉద్యోగావకాశాలు దూరమయ్యాయి.
 – ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు దక్కాలంటే పరిశ్రమలు రావాలి. పారిశ్రామిక రాయితీలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. 
– ప్రత్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక రాయితీలకు అవకాశం ఉంటుంది.
– ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయాలని 15వ ఆర్ధిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.

మరిన్ని వార్తలు