చెప్పిందే చేస్తున్నాం

11 Feb, 2020 03:52 IST|Sakshi

ఆంగ్ల పత్రికల ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి జగన్‌

ప్రజల ముందే లబ్ధిదారుల జాబితాలు

భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లిష్‌ మీడియం తెస్తున్నాం

విశాఖ మరో పదేళ్లకైనా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుంది

ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?

సీఎం స్థానం అంటే.. ఈ రాష్ట్రానికి తండ్రి లాంటిది. దేవుడు మనకు ఈ స్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయమైనా ఒక తండ్రిలా ఆలోచించి తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే కూడా తప్పే అవుతుంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఏం చెప్పామో అదే చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏటా రెవెన్యూ ఎంతో కొంత పెరుగుతుందని, నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చు కానీ పెరుగుదలైతే ఉంటుందన్నారు. ఆంగ్ల పత్రికల ప్రతినిధులతో సోమవారం ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. పెన్షన్లు, ఇంగిష్‌ మీడియం, రాజధాని, ప్రత్యేక హోదా, మండలి రద్దు, పోలవరం, కియాపై అసత్య ప్రచారం తదితర అంశాలపై ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలను ఈ సందర్భంగా ఆయన స్పష్టీకరించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..

సంతృప్త స్థాయిలో లబ్ధి కల్పించడమే లక్ష్యం
‘మాకు ఓటు వేయని వారికి కూడా పెన్షన్లు ఇవ్వండని చెప్పాం. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితా ప్రజల ముందే ఉంచుతున్నాం. ఈ రోజు ఫోన్‌ ఆన్‌ చేస్తే కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకొస్తున్నాం. రాజధానిపై నేను చెప్పాల్సిందంతా అసెంబ్లీలోనే చెప్పా. మౌలిక వసతుల కోసమే రూ.1,09,000 కోట్లు అవుతుందని గత ప్రభుత్వం అంచనా వేసింది.

ఆ డబ్బులో 10వ వంతు విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. మరో 10 ఏళ్లకైనా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుంది. అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా మారుస్తాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాం. అమరావతిని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని, అమరావతి రైతులెవ్వరికీ అన్యాయం చేయం అని చెప్పాం. రాజధానిపై బీజేపీ జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెబుతుంటే, రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు.  

కొద్ది జాప్యమే.. అడ్డుకోలేరు
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు అసెంబ్లీలో బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్‌డీఏని ఏఎంఆర్‌డీఏగా మార్చడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కానీ రాష్ట్రంలో అందరికీ మంచి చేస్తున్నామని ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టాం. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవరూ అడ్డుకోలేరు.  ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. తాము ఎక్కడికీ వెళ్లడం లేదని కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాల కోసం వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4 వేల కోట్లను గత ప్రభుత్వం 2014 నుంచి చెల్లించలేదు. ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లారు.
 
ఇది అభివృద్ధి కాదా?
విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, గృహ నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రాధాన్యతలుగా నిర్ణయించాం. నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులను బాగా అభివృద్ధి చేస్తున్నాం. మధ్యాహ్న భోజనం నాణ్యత బాగా పెంచాం. అమ్మఒడి అమలు చేశాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసాతో అన్నదాతలను ఆదుకుంటున్నాం. పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు