మీ రుణం తీర్చుకుంటున్నా..

26 Dec, 2019 03:51 IST|Sakshi
పులివెందులలో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పలు అభివృద్ధి కార్యక్రమాలకు తొలి విడతగా రూ.1,329 కోట్లతో శంకుస్థాపన

అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలల ఏర్పాటు

పీబీసీ, లింగాల, గండికోట లిఫ్ట్‌ పెండింగ్‌ పనులపై దృష్టి

మైక్రో ఇరిగేషన్‌ కిందకు పీబీసీ ఆయకట్టు

పులివెందుల– బెంగళూరు రోడ్డు విస్తరణ

త్వరలో 20 టీఎంసీలతో కొత్త రిజర్వాయర్‌

సాక్షి ప్రతినిధి కడప: ‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్‌ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హాజరైన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

పలు గ్రామాల్లో కొత్త చెరువుల తవ్వకం..
‘‘గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్‌ నిర్మిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు సర్వే చేశారు. రాబోయే రోజుల్లో ఈ డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తాం. దీంతో జిల్లాలో కరువు పరిస్థితిని అధిగమిస్తాం. ముద్దనూరు –  కొడికొండ చెక్‌పోస్టు (పులివెందుల–బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తాం. పెండింగ్‌లో ఉన్న పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ), లింగాల బ్రాంచ్‌ కెనాల్, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో చెరువులు లేని గ్రామాల్లో కొత్త చెరువులు తవ్వుతాం. సర్వే చేయించి.. ఆ చెరువులకు దగ్గరలో ఉన్న కాలువలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. ఆ చెరువులకు మైక్రో ఇరిగేషన్‌తో లింక్‌ చేసి ఆయకట్టుకు నీరందిస్తాం.

మొత్తం పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్‌ కిందకు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. రాబోయే పర్యటనల్లో వాటికి శంకుస్థాపనలు చేస్తాను. ఇవాళ 24 పనులకు (జాబితా చదివారు) శంకుస్థాపన చేస్తున్నా’’ అని సీఎం జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎంలు ఎస్‌బీ అంజద్‌బాష, ఆళ్ల నాని, మంత్రులు శంకర నారాయణ, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ మేయర్, కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

సీఎం శంకుస్థాపన చేసిన పనుల వివరాలు..
►పులివెందులలో రూ.347 కోట్లతో వైఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు.
►గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా వేముల, వేంపల్లె మండలాల్లోని 15 వేల ఎకరాల  స్థిరీకరణ. రూ.58 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు నగరి సుజల స్రవంతి) నుంచి నీళ్లందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివర ఉన్న వి.కొత్తపల్లె, గిడ్డంగివారిపల్లె, టి.వెలమవారిపల్లె, ముచ్చుకోన చెరువులకు నీరందుతుంది. (తర్వాత ఈ నీళ్లు పాపాగ్నిలో కలుస్తాయి) తద్వారా నందిపల్లి, ఉప్పాలపల్లె, ముసల్‌రెడ్డిపల్లె గ్రామాలకు సైతం ప్రయోజనం చేకూరుతుంది.
►చిత్రావతి నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపి, వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) వల్ల ప్రభావితమయ్యే ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం. రూ.350 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కోమన్నూతల, ఎగువపల్లి, మురారిచింతల, అంబకపల్లె, ఎర్రబల్లి చెరువు, మోటూన్నూతలపల్లె వంక, తదితర గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. గిడ్డంగివారిపల్లెలో 1.1 టీఎంసీ రిజర్వాయర్‌ నిర్మించి యూసీఐఎల్‌ పల్లెలకు నీటి సరఫరా చేయొచ్చు.
►పులివెందులలో రూ.100 కోట్లతో 55.36 కిలోమీటర్లు భూగర్బ డ్రైనేజీ సిస్టమ్‌ ఏర్పాటు.
►పులివెందులలో రూ. 65 కోట్లతో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్‌ నిర్మాణం.
►వేంపల్లె గ్రామ పంచాయతీలో రూ.63 కోట్లతో 85.50 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ ఏర్పాటు.
►పులివెందుల నియోజకవర్గంలో రూ.114 కోట్ల పాడా నిధులతో సీసీ రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, పీబీసీ, సీబీఆర్‌ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్‌ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. దీంతోపాటు పీబీసీ నుంచి దొండ్లవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనం బావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయనిచెరువు నుంచి బత్తెనగారి చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల బ్రాంచ్‌ కెనాల్‌ కింద రామట్లపల్లె చెరువు, గుణకనపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల్‌ కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నల్లపురెడ్డిపల్లె, కమ్మాయిగారిపల్లె కుంటకు నీళ్లందిస్తారు.
►పులివెందుల నియోజకవర్గంలో రూ.13.21 కోట్లతో ఏడు మార్కెట్‌ గిడ్డంగులతోపాటు పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్‌ యార్డులలో మౌలిక వసతుల కల్పన
►పులివెందులలో హార్టికల్చర్‌ పంటల కోసం రూ.13 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రీకూలర్, కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణాలు.
►నల్లచెరువుపల్లె గ్రామంలో రూ.27 కోట్లతో 132 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రం ద్వారా 14 గ్రామాలకు లబ్ధి కలిగేలా పనులు.
►రూ.10 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం.. 10 గ్రామాల్లోని 2,100 వ్యవసాయ, 10,200 గృహ విద్యుత్‌ సర్వీసులకు లబ్ధి.
►రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.19.60 కోట్లతో కడప – పులివెందుల రోడ్డులోని వేంపల్లె పట్టణం నుంచి నూలివీడు, పందికుంట, కోళ్లకుంట రోడ్డు పనులు.
►రూ.11.52 కోట్లతో పులివెందులలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి.
►రూ.9.30 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకు వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ విస్తరణ.
►రూ.17.50 కోట్లతో పులివెందుల స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ అకాడమి ఏర్పాటు. తద్వారా 14 రకాల స్పోర్ట్స్‌కు అన్ని రకాల వసతులతో శిక్షణ.
►రూ.20 కోట్లతో ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్‌ మెమోరియల్‌ గార్డెన్‌ అభివృద్ధి.
►పులివెందుల నియోజకవర్గంలో రూ.16.85 కోట్లతో 51 దేవాలయాల పునరుద్ధరణ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 18 కొత్త దేవాలయాల నిర్మాణం.
►పులివెందులలో రూ.10 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (మినీ సచివాలయం) ఏర్పాటు.
►రూ.11.20 కోట్లతో నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం.
►రూ.4.50 కోట్లతో వేంపల్లెలో నూతన ఉర్దూ జూనియర్‌ కళాశాల నిర్మాణం.
►రూ.20 కోట్లతో వేంపల్లెలో కొత్తగా డిగ్రీ కళాశాల నిర్మాణం.
►పులివెందుల జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో రూ.20 కోట్లతో లెక్చర్‌ కాంప్లెక్స్, నైపుణాభివృద్ది కేంద్రం ఏర్పాటు.  
►రూ.4 కోట్లతో వేంపల్లెలో బీసీ బాలురు, బాలికల వసతి గృహాల నిర్మాణం.
►పులివెందులలో రూ.3.64 కోట్లతో మోడల్‌ పోలీసుస్టేషన్‌ నిర్మాణం.

పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నాం. నాన్నగారి హయాంలో నిర్మించిన.. ప్రస్తుతం దైన్యస్థితిలో ఉన్న ఐజీ కార్ల్‌ భవనాల్లో ఈ కళాశాలలను ఏర్పాటు చేస్తాం. త్వరలో వీటికి పునాది రాయి వేస్తాం. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లిస్తాం. దేవుడి ఆశీర్వాదంతో మరిన్ని గొప్ప పనులు చేసేలా దీవించాలని పేరుపేరునా ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.    
– సీఎం వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు