ఇకపై రుచికరమైన భోజనం..

30 Oct, 2019 07:28 IST|Sakshi
మరియాపురం బాలికల పాఠశాలలో భోజనం వడ్డిస్తున్న ఉపాధ్యాయులు

ఇక నాణ్యతగా, శుచిగా ఆహారం 

త్వరలో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు 

ప్రణాళికపై దృష్టి సారించిన అధికారులు 

విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాల సేకరణ 

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు మొదలు పెట్టారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలు ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే సదాశయంతో సమూల మార్పులు చేస్తున్నారు. సంబంధిత విషయమై జిల్లాలోని పలు మండలాలకు సంబంధించిన ఎంఈఓ, హెచ్‌ఎంలతోపాటు విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణను తీసుకుంటున్నారు.  ఈ నివేదికలను త్వరలో రాష్ట్ర అధికారులకు పంపనున్నారు. త్వరలోనే మధ్యాహ్న భోజనంలో మార్పులు చోటుచేసుకుని పిల్లలకు నాణ్యమైన భోజనం అందనుంది.  

సాక్షి, కడప ఎడ్యుకేషన్‌ : పేద విద్యార్థులకు కడుపు నింపేందుకు ప్రారంభించిన మధ్యాహ్న భోజనంలో సమూల మార్పులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రుచికి, శుచికి ప్రాధాన్యం ఇస్తూ కమ్మని వంటలను వండి పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని నామమాత్రంగా అమలు చేయడంతోపాటు ఏనాడూ రుచికరంగా అందించలేదనే విమర్శలు ఉన్నాయి. వీటితోపాటు పర్యవేక్షణ కూడా కొరవడి.. వంట నిర్వాహకులు పెట్టిందే మెనూ వండిందే తిను అనే తరహాలో సాగిందనే చెప్పాలి. ఇక మీదట వాటికి స్వస్తి పలికి విద్యార్థులు అర్ధాకలితో కాకుండా కడపునిండా తిని మనస్ఫూర్తిగా చదువుపై దృష్టి సారించే విధంగా.. ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కార్మికులకు గౌరవ వేతనాన్ని మూడింతలు పెంచారు. అలాగే విద్యార్థుల భోజనానికి ఇచ్చే డబ్బులను కూడా పెంచారు. ఫలితంగా జిల్లాలో 2,13,322 మంది విద్యార్థులకు ఇకపై రుచికరమైన భోజనం అందనుంది.  

నివేదికల కోసం ఆదేశాలు 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంపై సమగ్ర నివేదికలను ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి జిల్లాలోని పలువురు ఎంఈఓలు, హెచ్‌ఎంలను మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, అందులో చేయాల్సిన మార్పులు చేర్పులపై నివేదిక ఇవ్వాలని చెప్పారు.  మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు కడుపు నిండా తింటున్నారా లేక ఇందులో మార్పులనేమైనా తీసుకురావాలా అనే అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయ సేకరణను తీసుకోనున్నారు.  

భోజనం చేస్తున్న విద్యార్థులు  
జిల్లాలో అమలు తీరు 
జిల్లాలో విద్యాశాఖ ద్వారా 2632 ప్రాథమిక, 335 ప్రాథమికోన్నత, 365 ఉన్నత పాఠశాలల్లో కలుపుకొని 2,13,322 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వీటిలో కడప మండలంలో మాత్రం ఇస్కాన్‌ సంస్థ పిల్లలకు సరఫరా చేస్తోంది. కడప సమీపంలోని ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఒకే చోట మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేసి.. మండలంలోని వందకు పైగా స్కూల్స్‌కు వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇస్కాన్‌ సంస్థ ప్రభుత్వ మెనూను సక్రమంగా అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా పలుమార్లు ఆందోళన చేపట్టాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు.  

కార్మికులకు పెరిగిన గౌరవ వేతనం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కుక్‌లు, హెల్పర్లకు గత ప్రభుత్వం ఇస్తున్న రూ. 1000 నుంచి ఒక్క సారిగా రూ.3000కు పెంచారు. జిల్లా వ్యాప్తంగా 5745 మంది కుక్స్, హెల్పర్లు ఉన్నారు. వీరికి సంబంధించి పెంచిన జీతాన్ని ఆగస్టు నుంచి అమలు చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనానికి ఇచ్చే డబ్బులను పెంచారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి గతంలో ఇస్తున్న 4.35 నుంచి ప్రస్తుతం 4.48కు పెంచడం జరిగింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్కరికి 6.51 నుంచి 6.71 పెంచారు. ఈ పెంచిన డబ్బులను ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తున్నారు.  

నివేదిక సిద్ధం చేస్తున్నాం 
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎంఈఓలు, ఉపాధ్యాయులు, పిల్లల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ఇందులో అందరి అభిప్రాయాల్లో ఎక్కవ మంది చెప్పిన వాటిని క్రోడీకరించి నివేదిక సిద్ధం చేçస్తున్నాం. అందరి అభిప్రాయాలు రాగానే  నివేదికను ప్రభుత్వానికి పంపుతాం.  – పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి    

వంట ఏజెన్సీల  వివరాలు 
జిల్లాలో ఉన్న వంట ఏజెన్సీలు : 5745      
గతంలో కుక్స్‌కు నెలకు ఇస్తున్న వేతనం : 1000 
ప్రస్తుతం ఇస్తున్న వేతనం : 3000 
వంట గదులు
జిల్లాలోని మొత్తం వంట గదులు: 1687 
ఫేజ్‌–1 లో మంజూరైనవి : 1150 
పూర్తి అయినవి : 962 
వివిధ కారణాలతో ప్రారంభం కానివి: 188 
ఫేజ్‌– 2లో మంజూరైనవి: 537  
పూర్తి అయినవి: 357  
వివిధ దశల్లో ఉన్నవి: 11 
మొదలు కానివి: 169 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా