భయాన్ని కాదు.. ధైర్యాన్ని నింపండి

20 Mar, 2020 04:27 IST|Sakshi
కరోనా వైరస్‌ నియంత్రణపై గురువారం జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ సాహ్ని తదితరులు

కరోనాపై సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష

వైరస్‌ నివారణకు మరికొన్ని కీలక చర్యలు

థియేటర్లు, మాల్స్, ఇండోర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు, జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేత

పెద్ద దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూ దర్శనాలు నిలిపివేత

చిన్న ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లకపోతే మంచిది

పెళ్లిళ్లు, జాతరలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి

జలుబు, జ్వరం లక్షణాలుంటే ప్రయాణాలు మానుకోవాలి

మార్చి 31 వరకు అమల్లో ఈ నిర్ణయాలు.. వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి తప్ప భయాన్ని కాదని సీఎం వైఎస్‌ జగన్‌  స్పష్టం చేశారు. ఈ వైరస్‌ను అరికట్టడంలో భాగంగా గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య పరంగా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా నివారణకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన ప్రణాళిక, వైరస్‌ సోకిన వారికి అందించాల్సిన వైద్యం, ప్రభుత్వం తరఫున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై చర్చించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 31 వరకు అమలులో ఉండేలా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

జనం గుమిగూడకుండా చూడాలి
►పబ్లిక్‌ ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా చూడటంలో భాగంగా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్, ఇండోర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు మూసి వేయాలి.
►పెద్ద దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూనే భక్తులకు దర్శనాలు నిలిపేయాలి. చిన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సైతం భక్తులు వెళ్లడం మానుకోవాలి. జాతరలు లాంటివి నిర్వహించకపోతే మేలు.  
►హోటళ్లు, రెస్టారెంట్లలో మనిషికి మనిషికి మధ్య 2 మీటర్ల ఎడం పాటించేలా చూడాలి. వివాహాది శుభకార్యాలను వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలి. వీలైతే వాయిదా వేసుకోవాలి.  
►ప్రజా రవాణాలో ఉన్న వాహనాలు శుభ్రత పాటించాలి. ఎక్కువ మందిని బస్సుల్లో ఎక్కించుకోకూడదు. నిల్చొని ప్రయాణం చేసే పరిస్థితి ఉండకూడదు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నవారు ప్రయాణాలు మానుకోవాలి.

నెలాఖరు దాకా అంక్షలు
రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి గురువారం జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ చేసిన సూచనల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. ఇవీ ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని, అందరూ తప్పకుండా పాటించాలన్నారు.

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
►రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబాలు, ఇతరత్రా ఇంటింటి సర్వే చేయించామన్నారు. సహాయక చర్యలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల రూపంలో మనకు మంచి వ్యవస్థ ఉందని చెప్పారు. 
►ఇప్పటిదాకా రెండు పాజిటివ్‌ కేసులు (ఒంగోలు, నెల్లూరు – ఇద్దరూ విదేశాల నుంచి వచ్చిన వారే.. నెల్లూరు యువకుడు పూర్తిగా కోలుకున్నాడు) నమోదయ్యాయని వివరించారు. ఫిలిప్ఫైన్స్‌ నుంచి వచ్చిన 185 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు.
►పలు మార్కెట్లు మూసి వేయడంతో మొక్కజొన్న, జొన్న ధరలు తగ్గుతున్నాయని, ఈ రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అరటి, చీనీ తదితర పండ్ల ధరలు కూడా తగ్గిపోతున్నాయని, కొద్ది రోజుల్లో తిరిగి ధరలను స్థిరీకరించే అవకాశం ఉందని చెప్పారు.

ఇలా చేయండి..
►ఇంటింటి సర్వే తర్వాత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో మ్యాపింగ్‌ చేయించాలి. సచివాలయాల్లోని హెల్త్‌ అసిస్టెంట్లు, ఉద్యోగులు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్, వలంటీర్లు, మహిళా పోలీసులందరికీ యాప్‌ అందుబాటులో ఉంచాలి. 
►ప్రతి వలంటీర్‌ నుంచి 50 ఇళ్లకు సంబంధించిన డేటా సహా ఎప్పటికప్పుడు పరిస్థితులపై వివరాలను యాప్‌ ద్వారా తెప్పించుకోవాలి. ఆ డేటాపై సంబంధిత వైద్య సిబ్బంది అలర్ట్‌ కావాలి. ప్రజలు ఏం చేయాలి? ఏం చేయకూడదన్నదానిపై సూచనలు ఇవ్వాలి. 
►వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతూనే, ప్రజలకు ధైర్యం చెప్పాలి. తీవ్ర భయానికి గురిచేసేలా వ్యవహరించొద్దు.

మరిన్ని వార్తలు