విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

28 Dec, 2019 18:48 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసేలా రెండు రోజుల పాటు ఆర్‌కే బీచ్‌లో నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. సీఎం రాకతో సాగర తీరం జనసందోహంలా మారింది. థాంక్యూ సీఎం నినాదం హోరెత్తింది. వేదికపైకి వచ్చిన సీఎం జగన్‌కు  రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి శాలువా కప్పి సత్కారం చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. లేజర్‌ స్పెషల్‌ షో ప్రదర్శించారు.

స్థానికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ‘మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ రోజు విశాఖ ఉత్సవాలను ఇప్పేడే ఇక్కడే ప్రారంభిస్తున్నాం’ అని సీఎం జగన్‌ అనగానే లేజర్‌ షో ద్వారా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్‌కు వారు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, రెండు రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమాని జనం భారి ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించనున్నారు. మొదటి రోజు శాస్త్రీయ నృత్యం, లేజర్ షో, పాప్ సింగర్ అనుదీప్ ప్రత్యక్ష కచేరీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు జరగనున్నాయి. రెండవ రోజు, 'త్రీరీ' లైవ్ బ్యాండ్, ఆర్చరీ షో, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కచేరీ, లేజర్ షో మరియు బాణసంచా తదితర ప్రోగ్రామ్‌లతో విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమం ఘనంగా ముగియనుంది. 


మరిన్ని వార్తలు