వైఎస్సార్‌ రైతు భరోసాను పండుగలా నిర్వహిద్దాం: వైఎస్‌ జగన్‌

24 Jun, 2019 15:36 IST|Sakshi

కలెక్టర్ల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగలా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. పథకం ద్వారా లబ్ధిపొందే మొత్తాన్ని రైతులకు ఒకే రోజు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. వాస్తవంగా రైతు భరోసాను మే మాసంలో ఇవ్వాల్సిఉందని, కానీ రైతుల దుస్థితిని చూసి అక్టోబరులోనే రబీ సీజన్‌ కోసం ఇస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 1.25 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 50శాతం, 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న భూమి ఉన్న రైతులు 70శాతానికి పైగా రైతులు ఉన్నారని వెల్లడించారు.  

సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘50శాతం మంది రైతులకు కావాల్సిన పూర్తి పెట్టుబడి రైతు భరోసా ద్వారా అందుతున్నట్టే. అక్టోబరు 15న రైతు భరోసా అందుతుంది. స్టాంపు పేపర్‌ ఫార్ములా మాదిరిగానే ఒక పత్రాన్ని కౌలు రైతుల కోసం గ్రామ సచివాలయంలో ఉంచుతాం. 11 నెలల కాలానికి భూమిపై హక్కులు కాకుండా, పంట సాగు చేసుకునేలా అనుమతులు రైతుల నుంచి కౌలు రైతులకు అందేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. దీనివల్ల కౌలు రైతులకు కొంత మంచి జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా రూ.12500 ఇచ్చే ఏర్పాటుచేస్తాం.

ఆత్మహత్య చేసుకున్న రైతులకు గత ప్రభుత్వం సరిగ్గా పరిహారం ఇవ్వలేదు. ఈ పరిస్థితులు పూర్తిగా మార్చబోతున్నాం. రైతు కుటుంబాలకు ఏం జరిగినా.. ఆత్మహత్య జరిగినా, ప్రమాదంలో మరణించినా స్థానిక కలెక్టర్‌ వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో పనిలేకుండా వెంటనే స్పందించి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి. స్థానిక ఎమ్మెల్యేను కూడా కలుపుకొని ఆ కుటుంబానికి రూ.7 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి. సీఎం మీకు తోడుగా ఉంటారని రైతు కుటుంబానికి భరోసా ఇచ్చి.. మీరు ఆ కుటుంబానికి సహాయం చేయండి’ అని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు