వేసవిలో నిరంతర విద్యుత్‌ సరఫరా

7 Apr, 2020 04:40 IST|Sakshi

10 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లపై స్పీడ్‌ పెంచాలి 

విద్యుత్‌ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: వేసవిలో నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్‌ కోసం ప్రత్యేకంగా ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. కరోనా, వేసవి కాలంలో విద్యుత్‌ సంస్థల పనితీరుపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థల రెవెన్యూ బాగా పడిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీన్ని అధిగమించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. 

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే.. వేసవి కాలంలో విద్యుత్‌ డిమాండ్, లభ్యతపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలోని థర్మల్‌ ప్లాంట్ల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, మండు వేసవిలోనూ విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. 
► మరో రెండు వారాల పాటు వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్‌ ఉండే వీలున్నందున ఉదయం సమయంలోనే మోటార్లకు విద్యుత్‌ సరఫరా జరగాలని సీఎం ఆదేశించారు. 
► వ్యవసాయ పంపు సెట్ల కోసం ఉద్దేశించిన 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. టెండర్లు పిలిచేందుకు వీలుగా అవసరమైన ప్రక్రియకు సిద్ధం కావాలన్నారు.  
► విద్యుత్‌ పంపిణీ సంస్థలకు విద్యుత్‌ బిల్లులు రాకపోవడంపై సమావేశంలో చర్చ జరిగింది. గ్రామ సచివాలయాల ద్వారా విద్యుత్‌ బిల్లుల వసూలు చేస్తే ఎలా ఉంటుందనే అంశం చర్చకొచ్చింది. ఈ సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌ బాబు, జెన్‌కో ఎండీ శ్రీధర్, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సీఎండీ సాయిప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు.   

మరిన్ని వార్తలు