బోటు ప్రమాదాలపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

6 Nov, 2019 19:05 IST|Sakshi

ప్రమాదాల నివారణకు 8 కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు 

సాక్షి, అమరావతి: బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో జలవనరులు, టూరిజం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బోటు ప్రమాదాలు, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు  వివరించారు. బోటు ప్రమాదాల నివారణ, భద్రత కోసం ఎనిమిది చోట్ల కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఏర్పాటుకానున్న ఈ కంట్రోల్‌ రూమ్‌లలో జలవనరులశాఖ, పోలీసులు, టూరిజం తదితర విభాగాలనుంచి సిబ్బందిని నియమిస్తారు. ప్రతి కంట్రోల్‌ రూంలో కనీసం 13 మంది సిబ్బంది ఉంటారు. ప్రతి కంట్రోల్‌ రూమ్‌లోనూ ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు తప్పనిసరి.

నవంబర్‌ 21న ఈ ఎనిమిది కంట్రోల్‌ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 90 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వరద ప్రవాహాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని.. బోట్లు ప్రయాణించాల్సిన మార్గాలు, బోట్ల కదలికలపై నిరంతర సమాచారాన్ని సేకరిస్తూ.. వాటి ప్రయాణాలను పర్యవేక్షించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. బోట్లలో ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్‌ వినియోగం ఉండకూడదని, అలాగే సిబ్బందికీ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలని తేల్చి చెప్పారు. బోట్లకు జీపీఎస్‌ కూడా పెట్టాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా కంట్రోల్‌ రూమ్స్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

కంట్రోల్‌ రూమ్స్‌ పరిధిలో బోట్లు, జెట్టీలు ఉండాలని, బోట్లపై ప్రయాణించేవారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్‌ రూమ్స్‌కే ఇవ్వాలని చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌కు ఎమ్మార్వోనే ఇన్‌చార్జి అని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కంట్రోల్‌ రూం చూడగలిగితే.. గ్రేడింగ్‌ ప్రకారం వారికి కనీసం 2 నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలని సీఎం తెలిపారు. బోట్లలో వాకీటాకీలు, జీపీఎస్‌లు తప్పనిసరిగా ఉండాలని, మరోసారి బోట్లన్నీ తనిఖీచేసిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని, ఆపరేటింగ్‌ స్టాండర్డ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ఆధారంగా బోట్లు నడువాలని ఆదేశించారు. నదిలో ప్రవాహాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్‌రూమ్‌లకు అందజేయాలని, కంట్రోల్‌ రూంలోని సిబ్బంది నదిలో ప్రయాణాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలని అన్నారు.

కంట్రోల్‌ రూమ్స్‌ సిబ్బందిని రిక్రూట్‌ చేశాక వారికి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని, వీరిని త్వరగా రిక్రూట్‌ చేయాలని అధికారులకు సూచించారు. బోట్లలో పనిచేసేవారికి కూడా శిక్షణ ఇవ్వాలని, శిక్షణ పొందినవారికే పనిచేయడానికి అనుమతి ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. ప్రస్తుతం లైసెన్స్‌లు, బోట్లను తనిఖీ చేస్తున్నామన్న అధికారులు.. తనిఖీలు చేసిన తర్వాతనే బోట్లకు అనుమతి ఇస్తామని తెలిపారు. దీనికోసం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా