మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌పై సీఎం జగన్‌ సమీక్ష

18 Nov, 2019 17:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ వెబ్‌ సైట్‌తో.. రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అగ్రికల్చర్‌ మిషన్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం అగ్రిమిషన్‌పై ఆయన సమీక్ష నిర‍్వహించారు. ఈ మేరకు రైతు భరోసా ద్వారా వచ్చే మే నెల నాటికి మరింత మందికి లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఇప్పటివరకూ 45,20,616 మంది కుటుంబాలకు చెందిన రైతులు రైతు భరోసా కింద లబ్ధి  పొందారని తెలిపారు. సుమారు రూ.5,185.35 కోట్ల పంపిణీ చేశామని వెల్లడించారు. డిసెంబర్‌ 15 వరకూ కౌలు రైతులకు అవకాశం ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులను కూడా  రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

గ్రామ సచివాలయాల పక్కన దుకాణాలు, వర్క్‌షాపుల ఏర్పాటుపై సమీక్షలో పాల్గొన‍్న సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల కోసం ఏర్పాటు చేసే దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. వర్క్‌షాపులో రైతులకు ఏయే అంశాలకు శిక్షణ ఇవ్వాలన్నదానిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. భూసార పరీక్షలు వర్క్‌షాపులోనే పెడుతున్నామని ఆయన తెలిపారు. నేచురల్‌ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన కల్పించి.. గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్ ‌అసిస్టెంట్ల సేవలను బాగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేయదలచిన వర్క్‌షాపుల్లో వారి సేవలను వాడుకోవాలన్నారు. బయో ఫెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్‌ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఏపీ బయో ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ యాక్ట్‌ తీసుకురావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌పై సమీక్ష నిర్వహించని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. గోడౌన్ల నిర్మాణంపై మండలాలు, నియోజకవర్గాల వారిగా మ్యాపింగ్‌ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వేరుశెనగ, మొక్కొజొన్నల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరలేని చిరుధాన్యాలను సాగుచేస్తున్న రైతులను ఆదుకోవడానికి.. సాగుకు అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకుని ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వమే ధరలు ప్రకటింస్తుందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల ధరల ప్రకటన త్వరలోనే చేయానున్నట్టు తెలిపారు. 

చీనీ రైతులకు మంచి ధర వచ్చేలా చూడటానికి అనుసరించాల్సిన మార్కెటింగ్‌ వ్యూహాలపై సమీక్షించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ యార్డుల్లో కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్‌ యార్డులను నాడు-నేడు తరహాలో అభివృద్ధి చేయాలని తెలిపారు. పంటలకు వణ్యప్రాణుల నుంచి రక్షణ కల్పించడంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు