కరోనాపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

6 Apr, 2020 13:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‍కరోనాపై సమీక్ష నిర్వహించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహార్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారని తెలిపారు. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని, దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రెడ్‌జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడకూడా ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ( ‘అమెరికాలోని ప్రతీ ఒక్కరూ ఈ వీడియో చూడాలి’ )

అనంతరం సీఎం జగన్‌ స్పందిస్తూ.. పరీక్షలకు సరిపడా టెస్టు కిట్లు తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటు రాకూడదని స్పష్టంచేశారు.  ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. కరోనా వైరస్‌ విపత్తు వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమోటా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో, ఇతరత్రా రూపంలో నూటికి నూరుపాళ్లు సహకారం అందిస్తానని అధికారులకు స్పష్టంచేశారు. 1902కు వచ్చే కాల్స్‌ పరిష్కారంపై దృషిపెట్టాలని, సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు